తాటి, ఈత చెట్ల నుంచి సూర్యోదయానికి ముందే సేకరించే పానీయం నీరా. ఆరోగ్యానికి మేలు చేసే నీరా ఉత్పత్తి ద్వారా గీత వృత్తిదారులకు ఊతమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఆ మేరకు రాష్ట్రంలోనే తొలి నీరా ఉత్పత్తి కేంద్రాన్ని భువనగిరి మండలంలోని నందనంలో ఏర్పాటు చేస్తున్నది. నాలుగెకరాల్లో రూ.8కోట్లతో అందుబాటులోకి తేనున్నది. సేకరణ, స్టోరేజీ, ప్యాకింగ్, రవాణా అంతా ఇక్కడి నుంచే జరుగనున్నది. నీరా అనుబంధ ఉత్పత్తులైన చక్కెర, బెల్లం, చాక్లెట్లు, తేనెను కూడా తయారుచేసి విక్రయించనున్నది. ఈ నెల 29న ప్లాంట్ నిర్మాణ పనులకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభ ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గురువారం పరిశీలించనున్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 27(నమస్తే తెలంగాణ) : నీరా ఆరోగ్యానికి మంచి పానీయం కావడంతో ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. నీరా స్టోరేజీ.. ఇతర రాష్ర్టాల్లో ఎలా అమలు చేస్తున్నారు..? అనే దానిపై ఉన్నతాధికారులు ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేశారు.
ఇటీవల నీరాను విక్రయించుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతి లభించింది. దాంతో భువనగిరి జిల్లా నందనంలో నీరా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాట్లు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల రూ. 8 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. ఇక హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో చేపట్టిన నీరా కేఫ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 29న రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా నందనంలో నీరా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కానుంది. నాలుగు ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. నవంబర్‌లోపు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నందనంతోపాటు, నారాయణపురం మండలంలోని సర్వేల్, ఇతర జిల్లాల్లోని మరో రెండు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి నీరా పానీయాన్ని నందనం కేంద్రానికి తీసుకురానున్నారు. ప్రతి రోజు రెండు వేల లీటర్ల నీరా కేంద్రానికి రానుంది. దీన్ని ఇక్కడే నిల్వ చేయనున్నారు.
ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇది పులియకుండా, పాడవుకుండా పాశ్చరైజేషన్ చేస్తారు. అచ్చంగా పాలను ఏ విధంగా పాశ్చరైజేషన్ చేసి.. ప్యాక్ చేస్తారో అవిధంగానే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే ప్యాక్డ్ నీరాతోపాటు, అనుబంధ ఉత్పత్తులైన చాక్లెట్, బెల్లం, చక్కెరను హైదరాబాద్‌లోని నీరా కేఫ్‌కు రవాణా చేయనున్నారు. నెక్లెస్ రోడ్డు నీరా కేఫ్తోపాటు త్వరలో అన్ని జిల్లాల్లో కేఫ్‌లు విస్తరించనున్నారు. వీటికి కూడా నందనం కేంద్రం నుంచే నీరా, అనుబంధ ఉత్పత్తులు రవాణా కానున్నాయి. నీరా కేఫ్‌లోనే కాకుండా త్వరలో ప్రైవేట్ డీలర్లకు కూడా డీలర్షిప్ ఇచ్చి నీరా అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకు ంటున్నట్లు అధికారులు తెలిపారు.
హరితహారంలో భాగంగా ప్రభుత్వం తాటి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. నీరాతోపాటు వాటి నీరు అనుబంధ ఉత్పత్తులు కూడా తయారు చేయవచ్చు. నీరా ఆవిరి పట్టించడం ద్వారా ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో ఉత్పత్తి వస్తుందని అధికారులు చెబుతున్నారు. తాటి బెల్లం, పంచదార, చాక్లెట్లు, తేనే లాంటి 18 రకాల బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు.
ఇక తాటి ఆకులతో అలంకరణ వస్తువులు కూడా తయారు చేయవచ్చు. తాటి మట్టలతో బ్రష్‌లు, తాటి ముంజలు, గేగులతో బిస్కెట్లు తదితర ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉంది. దీని కోసం గీత కార్మిక ఫెడరేషన్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతానికి గీత కార్మికులకు మాత్రమే నీరా అమ్మకాలకు అనుమతి ఉంది.
ప్రస్తుతం జనం కొత్త పోకడలకు పోయి విదేశీ లిక్కర్, ఇతర ఆల్కహాల్‌ను సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కొత్తకొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ కంటే నీరా మంచిదని సహజసిద్ధంగా వస్తుందని, ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. 100 ఎంఎల్ నీరాలో 264 కేసీఎల్ ప్రొటీన్, పిండి పదార్థం, సున్న శాతం కొవ్వు, లవణాలు, ఐరన్ మెగ్నీషియం, జింక్, సోడియం పొటాషియం, భాస్వరం, కాల్షియం, థయామిన్, వివిధ రకాల విటమిన్లతో పాటు పోషకాలు ఉండి టానిక్‌లా పనిచేస్తున్నది.
గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో షుగర్ ఉన్నోళ్లు కూడా సేవించవచ్చు. ఇందులో సుక్రోజ్ ఉండటంతో డయాబెటిస్ ఉన్నోళ్లు, చిన్నపిల్లలు, గర్భిణులు కూడా పానీయంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. కిడ్నీ రోగులకు డాక్టర్లు నీరానే ప్రిఫర్ చేస్తారు. గర్భిణులు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధాల్లో కూడా నీరాను వాడుతారు. గర్భిణులు వారం లో నాలుగు సార్లు నీరాను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా, మంచి రంగులో పుడతారని పరిశోధకులు చెబుతున్నారు.
నీరా తాటి, ఈత చెట్ల నుంచి లభ్యమవుతుంది. సూర్యోదయం కాకముందే చెట్టు నుంచి గీస్తే దాన్ని నీరా అంటారు. ఇందులో ఎలాంటి ఆల్కహాల్ కలవదు. అయితే నీరాను సేకరించే పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకమైన కుండలు ఉంటాయి. కుండలో జెల్ లాంటి కెమికల్ ఉంచి తాటి, ఈత చెట్లకు అమర్చుతారు. తెల్లవారు జామున నాలుగున్నర సమయంలో నీరాను సేకరించవచ్చు. అయితే సేకరించిన వెంటనే తాగాలి. అప్పుడు అది తియ్యగా, రుచిగా ఉంటుంది.
మత్తు కూడా ఉండదు. చెట్టుపై ఎండ తగిలితే అది పులిసిపోయి కల్లుగా మారుతుంది. పులిసిపోకుండా ఉండడానికి అధికారులు కసరత్తు చేస్తారు. స్టోరేజీ సమస్య లేకుండా అధ్యయనం చేశారు. వివిధ రాష్ర్టాల్లో పర్యటించారు. తక్కువ ఉష్ణోగ్రతలో పెడితే నీరా పులిసిపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లాంటి ప్రదేశాల్లో పెడితే సుమారు ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ మొత్తం ప్లాంట్‌లో అమర్చనున్నారు. తద్వారా నీరాను నిల్వ చేయనున్నారు.
భువనగిరి మండలంలోని నందనంలో నీరా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే రూ.8 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. నాలుగు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటగా హైదరాబాద్ కేఫ్‌గా ట్రాన్స్పోర్ట్ చేస్తం. త్వరలోనే రాష్ట్రమంతా సరఫరా చేస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనుబంధ ఉత్పత్తులు కూడా ప్రజలు ఉపయోగించుకోవచ్చు.
– నరేశ్ నాయక్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్