భువనగిరి కలెక్టరేట్, జూలై 25 : రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయాలనే సంకల్పంతో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని ప్రతియేటా అందిస్తున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.10 వేలు ఇస్తున్నది. జిల్లాలోని 2,54,977 మంది రైతులు ఉండగా ఈ వానకాలం సీజన్‌కు రూ.303.67 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే 2,33,461మంది రైతుల ఖాతాల్లో రూ.293.10కోట్లు జమ అయ్యాయి. సాగు సమయంలో పంట పెట్టుబడి చేతికి అందుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పంట పెట్టుబడి సాయంతోనే వ్యవసాయ పనులు చేపడుతున్నా. ఇంతకు ముందు పంట పెట్టుబడి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అప్పులతో వ్యవసాయం చేస్తే పండించిన పంట అప్పులకే సరిపోయేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– కోయగూర రమేశ్, రైతు, హుస్సేనాబాద్
నాకున్న ఇరవై ఎనిమిది గుంటలన్నర భూమికి సంబంధించి పంట పెట్టుబడి సాయం 3,437 రూపాయలు వచ్చాయి. నా బ్యాంకు ఖాతాలోనే జమ అయ్యాయి. పంట పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎన్నటికీ మరువలేను. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు అండగా నిలువడం గొప్ప విషయం. రైతులందరూ కేసీఆర్ వెంటే ఉంటారు.
– జమ్ముల రమేశ్, రైతు, చందుపట్ల
రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని అర్హులందరికీ అందిస్తాం. జిల్లాలో 2,54,977 మంది రైతులు ఉండగా దశలవారీగా నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
-అనూరాధ, జిలా వ్యవసాయ అధికారి