రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయంగా ఈ సీజన్లో ఇప్పటివరకు
నల్లగొండ జిల్లాలో 4.69,698 మంది రైతులకు రూ.601.74 కోట్లు.. సూర్యాపేట జిల్లాలో 2,81,882 మంది రైతులకు రూ.314 కోట్లు అందాయి.
చండూరు : బోనాల పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించడంతో ఇద్దరు పిల్లలు చండూరు పట్టణ శివారులో పొలం బాట పట్టారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయంగా గుంటుక పట్టి సాళ్లను చక్కదిద్దుతున్న దృశ్యం నమస్తేతెలంగాణ కంట పడింది.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు అధికారులు సోమవారం నీటిని విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది కూడా వానకాలం సీజన్లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని అందిస్తున్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన నాలుగు తడులు నీటిని వదలనున్నారు. ప్రాజెక్టు ఈఈ భద్రునాయక్, డీఈ చంద్రశేఖర్ ఆయకట్టుకు నీటిని వదిలారు. మూసీ ప్రాజెక్టు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కింద ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40 వేల ఎకరాల వరకు సాగునీరు అందనుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో నెల రోజులుగా గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. కాల్వల ఆధునీకరణ పనులు సాగుతుండటంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేదు. ఆయకట్టు పరిధిలోని బోర్లు, బావుల కింద రైతులు అందుబాటులో ఉన్న నీటితో నార్లు పోసుకున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో మిగిలిన పనులు నిలిపి వేసి మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆయకట్టుకు నీటిని వదిలారు. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నందికొండ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌కు 59,778 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. శ్రీశైలానికి ఎగువ నుంచి వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ త్వరలో నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగుకులకుగానూ 545.30 (199.5466 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఇంకా 112 టీఎంసీల నీరు చేరితే పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల వరకు నీరు నిల్వ ఉండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కుడికాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎడమ, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 1000 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 881.60 (196.5611 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు ఉంది.
కేతేపల్లి : ఇన్‌ఫ్లో పెరుగడంతో సోమవారం మూసీ ప్రాజెక్టు మూడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 3,597.49 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు 3,4,10వ నంబర్ గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. కాల్వలకు 86.52 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. ప్రాజెక్టులోకి 3,597.49 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 638.10(2.80 టీఎంసీలు)అడుగులు ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.
మొదటి విడుత : ఈ నెల 25 నుంచి ఆగస్టు 19 వరకు (25 రోజులు నీటి విడుదల)
రెండో విడుత : సెప్టెంబర్ 3 నుంచి 18 వరకు (15 రోజులు)
మూడో విడుత : అక్టోబరు 3 నుంచి అక్టోబర్ 18 వరకు (15 రోజులు)
చివరి విడుత : నవంబర్ 2 నుంచి నవంబర్ 17 వరకు (15 రోజులు). మొత్తం 115 రోజులు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 70 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ప్రతి విడుతకు 15 రోజుల విరామం ఇవ్వనున్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.