పెద్దఅడిశర్లపల్లి, జూలై 25 : మండలంలోని ఘనపురంలో మాజీ ఎంపీపీ కటికనేని లక్ష్మణ్‌రావు కుమారుడు మాధవరావు ఆర్థిక సాయంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
దాతను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ రవీందర్, ఎస్ఐ వీరబాబు, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, సర్పంచ్ తోటకూరి పావనీపరమేశ్, ఎంపీటీసీ మైనం సంధ్య పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ కటికనేని లక్ష్మణ్‌రావు సేవలు చిరస్మరణీయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. లక్ష్మణ్‌రావు 78వ జయంతి సందర్భంగా ఘనపురంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. లక్ష్మణ్‌రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల కోసం జీవించిన ప్రజల మనిషి లక్ష్మణ్‌రావు అని పేర్కొన్నారు.
అదేవిధంగా మండలంలోని అన్ని అర్హతలు ఉన్న గుడిపల్లి గ్రామపంచాయతీని మండలంగా ఏర్పాటు చేయాలని గుడిపల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో శాసన మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, గ్రామస్తులు ఎర్ర యాదగిరి, బోయ సుధాకర్‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, పగడాల సైదులు ఉన్నారు.