కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి8ః కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పేట్ బషీరాబాద్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో భూ కబ్జాదారులు బరితెగించారు. కాలనీకి చెందిన ప్రధాన రహదారిని ఆక్రమించి పక్కా ప్రహారీ గోడ నిర్మించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అక్కడి నివాస ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకొని రాత్రికి రాత్రే 40 ఫీట్ల రోడ్డును 20 ఫీట్లకు కుదించారు. సర్వేనంబర్ 67,68,69 లో కాలనీకి పశ్చిమ సరిహద్దులో ఉన్న రోడ్డు పొరుగున ఉన్న భూ యజమాని సర్వే నంబర్ 62 ద్వారా కబ్జా ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో 2021 డిసెంబర్లో కబ్జా ప్రయత్నం చేయగా స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దృష్టికి తీసుకెళ్లగా ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కానీ అక్రమదారులు మళ్లీ పాగా వేసి రాత్రికి రాత్రే గోడ నిర్మించారు. ఈ విషయంపై కాలనీవాసులు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా అటువైపుకు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే స్థలంలో చుట్టూ ప్రహారీగోడతో రోడ్డు స్థలాన్ని ఆక్రమించడంతో కాలవాసులంతా ఏకమై ఆదివారం తమ కాలనీ రోడ్డుకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో హుడా లేఅవుట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 అడుగుల రోడ్డు ఉండాలి.
కానీ కబ్జాదారులు రోడ్డుకు వాడాల్సిన సుమారు 20 అడుగుల స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మాణం చేపట్టడంతో, కాలనీకి వెళ్లే ప్రధాన దారి 20 అడుగులకే పరిమితమైంది. దీని వలన కాలనీలకు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాల సైతం గోడ మధ్యలోకి వచ్చేలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. అధికారులకు దొరకకుండా ఉండటానికి రాత్రికి రాత్రే ఇష్టానుసారంగా కాంపౌండ్ వాల్ నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ఇరుకుగా మారడంతో ఫైర్ ఇంజన్, అంబులెన్స్ రావడానికి సైతం వీలులేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆక్రమణ వల్ల స్ప్రింగ్ ఫీల్డ్కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు రెసిడెన్సీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్ప్రీంగ్ఫీల్డ్, చంద్రోదయ, సాయిసదన్, శ్రీసాయి ఎన్క్లేవ్, మమత రెసిడెన్సీ, జెవిసి రెసిడెన్సీ వంటి పలు అపార్ట్మెంట్లు, కాలనీల ప్రజలకు రాబోయే రోజుల్లో సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉందని, దీనిపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని 40 అడుగుల రోడ్డును పునరుద్దరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.