సూర్యాపేటసిటీ, జూన్ 25 : గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమన్నారు. దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాశనకారి అన్నారు. దీన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రవాణా, వినియోగంపై పటిష్ట నిఘా పెట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, సీఐలు ఆంజనేయులు, ఎస్బీ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐలు శ్రీనివాస్, క్రాంతి, సైదులు, సురేశ్, సాయి, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : యువత మాదక ద్రవ్యలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కళాశాల విద్యార్థులతో పోలీసులు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు రవాణ చేసినా, అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నరసింహారావు, ఎస్ఐలు రాంబాబు, నాగభూషణం, పాల్గొన్నారు.
చివ్వెంల : యువత మత్తుకు బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని సీఐ విఠల్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐ విష్ణు, హెచ్ఎం ప్రతాప్, పోలీస్ సిబ్బంది, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హూజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి సూచించారు. పట్టణంలో యువతతో కలిసి ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
గరిడేపల్లి : మాదక ద్రవ్యాలకు యువత ఆకర్షితులు కావొద్దని ఎస్ఐలు కె.కొండల్‌రెడ్డి, శంకర్‌నాయక్ అన్నారు. గ్రామంలోని పాఠశాల విధ్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలను నిరోధించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తుంగతుర్తి : డ్రగ్స్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్ఐ దానియేల్కుమార్ కోరారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సుధాకర్, దీపక్‌రెడ్డి, ప్రిన్సిపల్ నాగమణి పాల్గొన్నారు.
అర్వపల్లి : డ్రగ్స్ వాడకం వల్ల భవిష్యత్ చీకటిమయం అవుతుందని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటే ఉజ్వల భవిష్యత్ పొందవచ్చని ఎస్ఐ అంజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పారు. డ్రగ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం జెల్లా ప్రసాద్, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, నర్సయ్య, రవి, పురుషోత్తం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్దిరాల : మండల కేంద్రంలో ఎస్ఐ వెంకన్న, పోలుమల్ల గ్రామంలో ఏఎస్ఐ నాగయ్య ఆధ్వర్యంలో డ్రగ్స్ ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.