రాష్ట్రంలో అటవీ శాతాన్ని 33కు పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎనిమిదో విడుత షురూ అయ్యింది. 2014 నుంచి గత ఏడాది వరకు ఉమ్మడి జిల్లాలో ఏడు విడుతల్లో 14 కోట్లకు పైగా మొక్కలు నాటింది. గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.99 కోట్ల లక్ష్యానికి గాను 1.69 కోట్ల మొక్కలు నాటిన అధికారులు.. ఈ సారి 2.07 కోట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్న యంత్రాంగం.. మిగిలినవి మరో 11శాఖల భాగస్వామ్యంతో నాటేలా ఏర్పాట్లు చేస్తున్నది.
నల్లగొండ, జూన్ 25 : రాష్ర్టాన్ని హరితమయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎనిమిదో విడుత షురూ అయ్యింది. ఖాళీ స్థలాల్లో మొక్కల నాటింపుతోపాటు ఇంటింటికీ ఆరు చొప్పున పంపిణీని జిల్లా అధికార యంత్రాంగం శనివారం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12శాఖల భాగస్వామ్యంతో ఈ ఏడాది 2.07 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి హామీ నిధులతో కూలీలు పలుచోట్ల గుంతలు తీసి సిద్ధంగా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల యంత్రాంగం మొక్కల నాటింపు ప్రారంభించగా.. త్వరలో మిగిలిన శాఖలు షురూ చేయనున్నాయి. నల్లగొండ జిల్లాలో శనివారం మొక్కల నాటింపు ప్రారంభం కాగా.. తొలి రోజు 5వేల మొక్కలు నాటినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
రాష్ట్రంలో అటవీ శాతాన్ని 33కు పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎనిమిదో విడుత షురూ అయ్యింది. 2014 నుంచి గత ఏడాది వరకు ఉమ్మడి జిల్లాలో ఏడు విడుతల్లో 14 కోట్లకు పైగా మొక్కలు నాటింది. గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.99 కోట్ల లక్ష్యానికి గాను 1.69 కోట్ల మొక్కలు నాటిన అధికారులు.. ఈ సారి 2.07 కోట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్న యంత్రాంగం.. మిగిలినవి మరో 11శాఖల భాగస్వామ్యంతో నాటేలా ఏర్పాట్లు
చేస్తున్నది.
హరితహారంలో నాటేందుకు ఉమ్మడి జిల్లాలో 2.75 కోట్ల మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 1,741 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 1.65 కోట్లకు పైగా మొక్కలు పెరుగుతుండగా.. మిగిలినవి మున్సిపాలిటీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాంటేషన్ కోసం పెంచుతున్నారు. మొత్తం 2.75 కోట్ల మొక్కలు పెంచుతుండగా, భవిష్యత్ అవసరాలకు 76 లక్షలు ఉంచి 1.99 కోట్ల మొక్కలు నాటే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రతి నర్సరీలో సగటున పది వేల మొక్కలు పెంచగా అందులో 90శాతం అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో నర్సరీల్లోని మొక్కల రక్షణకు షేడ్ నెట్ ఏర్పాటు చేశారు. నర్సరీలను పర్యవేక్షించేందుకు మండలానికో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను నియమించారు.
హరితహారం కింద ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 2.07 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా.. వర్షాలు పడుతుండడంతో కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే మొక్కలు నాటించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు. దాంతో శనివారం నల్లగొండ జిల్లాలో మొక్కల నాటింపు ప్రక్రియ షురూ కాగా.. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తంగా ఇప్పటికే 50వేల మొక్కలు నాటారు. ఉపాధి హామీ నిధులతో కూలీల ద్వారా గుంతలు తీయగా వారితోనే మొక్కలు నాటించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీళ్లు పోసి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని 1741 గ్రామ పంచాయతీల్లో జీపీ కార్మికులు ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేస్తున్నారు.

రాష్ట్రంలో సగటు అటవీ శాతం తక్కువగా ఉండటంతో దాన్ని పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్న సర్కార్.. ఉమ్మడి జిల్లాలో ఏడు దఫాలుగా సుమారు 14 కోట్ల మొక్కలు నాటి పర్యవేక్షించే చర్యలు చేపట్టింది. ఎనిమిదో విడుతలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.69 కోట్ల మొక్కలు నాటిన అధికారులు.. ఈ సారి 2.07 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు చొప్పున 54 లక్షల మొక్కలు అందజేయనున్నారు.
హరితహారం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఈ సారి 12 శాఖలకు బాధ్యతలు అప్పగించింది. మొత్తం 2.07 కోట్ల లక్ష్యానికి గాను పంచాయతీ రాజ్ శాఖ 50శాతం మొక్కలు నాటనుండగా, మిగిలినవి ఇతర శాఖలు నాటనున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్ కోసం మొక్కలను బయటి నుంచి కొనుగోలు చేయకుండా అటవీ శాఖ నుంచే సరఫరా చేయనున్నారు. ఖాళీ స్థలాలతోపాటు రాష్ట్ర, జాతీయ హైవేల వెంట మొక్కలను నాటే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 మున్సిపాలిటీల్లో లక్ష చొప్పున మొత్తం 18 లక్షల మొక్కలు నాటనున్నారు.
నల్లగొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో సుమారు కోటి మొక్కల దాకా పెంచడం జరిగింది. వర్షాలు పడటంతో ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా మొక్కల నాటింపు చేపట్టాం. అదే విధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేస్తున్నాం. ఈ సారి జిల్లాలో 70.41 లక్షలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యం 12 శాఖల భాగస్వామ్యంతో పూర్తి చేస్తాం. మొక్కల నాటింపుతోపాటు పూర్తి స్థాయిలో పరిరక్షించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 5,880 మొక్కలు నాటారు.
– విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ