Meher Ramesh | టాలీవుడ్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిల్లా చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందిన మెహర్ రమేష్ అత్తమ్మ పద్మావతి గారు నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణ వార్త కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా సినీ వర్గాలను కూడా తీవ్రంగా కలచివేసింది. ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్టు చేస్తూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు.తన అత్తమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటోలను పంచుకున్నారు మెహర్ రమేష్.
ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7న పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు చెప్పాల్సి రావడం మా కుటుంబానికి తీరని లోటు” అంటూ ఎమోషనల్గా రాశారు. ఈ మాటలు చదివిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ధైర్యం చెబుతూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మెహర్ రమేష్ తన కుటుంబానికి ఎంత దగ్గరగా ఉంటారో, పెద్దలను ఎంత గౌరవిస్తారో ఈ పోస్టుతో మరోసారి స్పష్టమైంది. ఒకే తేదీన తన తల్లి, అత్తమ్మలను కోల్పోవడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా మిగిలిపోతుందని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా ద్వారా పద్మావతి గారికి నివాళులు అర్పిస్తూ మెహర్ రమేష్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సంఘటనతో టాలీవుడ్ వర్గాల్లో దుఃఖ ఛాయలు కమ్ముకున్నాయి.