భువనగిరి కలెక్టరేట్, జూన్ 23 : ప్రతిభావంతుల పిల్లల సౌకర్యార్థం భవిత కేంద్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపడుతామని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐఈఆర్పీ ప్రత్యేక ఉపాధ్యాయులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో భవిత కేంద్రాల ఉపాధ్యాయులు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
భవిత కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో దృష్టి లోపమున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులు ప్రయాణ సౌలభ్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తేగా స్పందించిన ఆమె త్వరలోనే ప్రైవేటు పాఠశాలల వాహనాల్లో తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఈఓ నర్సింహ, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, జోసఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.