మన పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం, మద్దతు ధరకు మించి రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుండడంతో తెల్లబంగారం సాగు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శాస్త్రవేత్తల సహకారంతో ఈసారి నూతన వంగడాలను సైతం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తక్కువ కాలంలో.. తక్కువ విస్తీర్ణంలో… ఎక్కువ పంట చేతికొచ్చే అధిక సాంద్రత పద్ధతికి శ్రీకారం చుడుతున్నది. ఈ వానకాలం సీజన్ రెండు ప్రైవేట్ కంపెనీల ద్వారా 3 కొత్త వెరైటీ అందుబాటులోకి తెచ్చింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 4,400 ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకొని రైతులకు ప్రోత్సాహకంగా ఎకరాకు నాలుగు వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నది. ఒకే ఏరివేతతో పూర్తి పంట చేతికి రానుండడంతోపాటు రెండో పంటకు సైతం వెళ్ల్లే అవకాశం ఉండడంతో రైతాంగం కూడా ఆసక్తి కనబరుస్తున్నది. సాధారణ పద్ధతిలో ఎకరాకు సగటున ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, నూతన పద్ధతిలో 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి వస్తుందన్నది అంచనా.
నల్లగొండ/దేవరకొండ, జూన్ 17 : రైతులు నూతన సాగు విధానాలతో అధిక దిగుబడి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వం సైతం సబ్సిడీతో రైతులను ప్రోత్సహిస్తున్నది. అధిక సాంద్రత పద్ధతిలో నల్లగొండ జిల్లాలో 4 వేల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 300 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 100 ఎకరాలు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 4,400 ఎకరాల్లో ఈసారి అధిక సాంద్రత పత్తి సాగుకు రైతులు ఉపక్రమించారు.
వ్యవసాయ అధికారులు జిల్లాలోని మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో సాగు చేసేందుకు పలు మండలాలను ఎంపిక చేసుకొని రైతులకు అవగాహన కల్పించి నూతన వంగడాలను సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అత్యధికగా దేవరకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు నూతన విధానంలో పత్తిని సాగుచేసేందుకు రైతులను సమన్వయం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. రెండు ప్రైవేటు కంపెనీల నూతన వంగడాలను ఎంపిక చేసుకుని రైతులను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రోత్సహిస్తుంది.
సాధారణ పద్ధతిలో ఎకరాకు 6 వేల మొక్కలు నాటుతుండగా అధిక సాంద్రత పద్ధతిలో 25 వేల మొక్కలు నాటనున్నారు. సాళ్ల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 15.సె.మీ దూరం ఉండేలా నాటుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సాధారణ పద్దతిలో ఎకరాకు రెండు విత్తన ప్యాకెట్లు అవసరం పడుతుండగా అధిక సాంద్రతలో ఎకరాకు ఐదు ప్యాకెట్లు((450 గ్రాములు) అవసరం పడుతున్నాయి. 45 రోజుల్లో పూత దశ ప్రారంభం అవుతుందని, 140 రోజుల్లో పంట పూర్తిగా చేతికొస్తదని తెలిపారు. సాధారణ పద్ధతిలో కంటే పంట కాలం తగ్గుతుండడంతో గులాబీ పురుగు బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ విధానంలో పత్తిని తీసేందుకు కూలీల కొరతకు చెక్ పెట్టేలా హార్వెస్టర్‌ను వినియోగించవచ్చని అధికారులు వివరించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసిన రైతులు వెంటనే యాసంగి సీజన్లో మరో పంటను సాగు చేసే వీలుంటుంది.
సాధారణ పద్ధతి కంటే అధిక సాంద్రతలో సాగు చేస్తే ఖర్చు పెరుగుతుండటంతో రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల సబ్సిడీ అందజేస్తున్నది. విత్తన ప్యాకెట్లు, కూలీలు, రవాణాకు ఈ మొత్తం అందనుంది. ఎకరాకు ఐదు ప్యాకెట్లలో మూడు విత్తన ప్యాకెట్ల నగదును సబ్సిడీ కింద ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేయనుంది.
నేను 18 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నా. పత్తి ప్రతి ఏటా ఏసినప్పటికీ పెద్దగా దిగుబడి రాట్లేదు. పంట కాలం కూడా ఎక్కువే. అధిక సాంద్రత పద్ధతి వల్ల తక్కువ సమయంలోనే పంట చేతికి రావడంతో పాటు రెండో పంట వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెప్పడంతో ఈసారి రెండు ఎకరాల్లో పత్తి సాగుకు విత్తనాలు తీసుకున్నా. ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేలు సబ్సిడీ ఇస్తుండటం సంతోషం.
– గుర్రం వెంకట్‌రెడ్డి, రైతు, తిప్పర్తి
తెలంగాణ పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈసారి పత్తి సాగు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భాగంగానే అధిక సాంద్రత పద్ధతిని ఎంచుకుని రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఈ పద్ధతిలో సాగు చేస్తున్న రైతుతో వ్యవసాయ అధికారులు టచ్‌లో ఉంటూ ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. ఎకరాకు 25 వేల మొక్కలు నాటుతుండటంతో మొక్కలు ఏపుగా పెరుగకుండా చూసుకున్నప్పడే దిగుబడి ఆశించిన మేరకు వస్తుంది. ప్రభుత్వం ఎకరాకు నాలుగు వేలు సబ్సిడీ ఇస్తుండటం రైతులకు కలిసి వచ్చే అంశం.
– వీరప్ప, ఏడీఏ, దేవరకొండ