సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిమాయకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా
తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై ఎగిసిన సెగలు ఉమ్మడి జిల్లానూ తాకాయి. మోదీ సర్కారు అనాలోచిత
నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన
ఉద్రిక్తంగా మారడంతో అన్ని స్టేషన్లలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ రైల్వే, సివిల్ పోలీసులు మోహరించారు. రైలు మార్గాల వెంట పెట్రోలింగ్ చేపట్టారు.
భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్, భువనగిరిలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, బీబీనగర్‌లో శాతవాహన, శబరి ఎక్స్‌ప్రెస్, నల్లగొండలో రేపల్లె ప్యాసింజర్ గంటకుపైగా నిలిచిపోయాయి. నల్లగొండ మీదుగా తిరువనంతపురం వెళ్లాల్సిన శబరి ఎక్స్‌ప్రెస్ రద్దవడంతో రిజర్వేషన్ చేసుకుని స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్యోగార్థులపై ఆర్పీఎఫ్ కాల్పులకు నిరసనగా పలుచోట్ల ఆగ్రహ జ్వాలలు ఎగిశాయి. పలు పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
నీలగిరి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో శుక్రవారం నల్లగొండ రైల్వే స్టేషన్లో భారీ బందోబస్తు నిర్వహించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రైల్వే పోలీసులతోపాటు, ఆర్పీఎఫ్, ఏఆర్, సివిల్, నల్లగొండ టూటౌన్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ప్రయాణికుడిని తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిచ్చారు.
అగ్నిపథ్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గంటకుపైగా నిలిచిన రేపల్లె ప్యాసింజర్ రైలు..
అల్లర్ల నేపథ్యంలో రైల్వే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ వైపు వేళ్లే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపివేశారు. దీంతో రేపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన రేపల్లే ఫాస్ట్ ప్యాసింజర్‌ను నల్లగొండలో సుమారు గంటకుపైగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : సైనిక రిక్రూట్మెంట్ అగ్నిపథ్‌లో కేంద్రం తీసుకువచ్చిన మార్పులను నిరసిస్తూ సికింద్రాబాద్‌లో కొందరు యువకులు రైలుకు నిప్పంటించారు. దీంతో పలు స్టేషన్లలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో స్టేషన్‌ను సందర్శించి భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్‌తోపాటు గుంటూరు -సికింద్రాబాద్ రైల్యే లైన్ వెంట మండలంలోని కొత్తగూడెం స్టేషన్ వరకు భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి హింసకు తావు లేకుండా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐలు దోరెపల్లి నర్సింహులు, ముత్యాల రాంమూర్తి, సిబ్బంది ఉన్నారు.
భువనగిరి అర్బన్, జూన్ 17 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలతో జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. భువనగిరి, నాగిరెడ్డిపల్లి రైల్లేస్టేషన్ల మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు 3 గంటల పాటు నిలిపివేశారు. శాతవాహన ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలు గూడ్స్ రైళ్లు సుమారు 3 గంటలకుపైగా నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణిలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నాగిరెడ్డిపల్లి నుంచి భువనగిరి బస్టాండ్‌కు ఆటోల్లో వెళ్లారు. భువనగిరి రైల్వేస్టేషన్లో దిగిన ప్రయాణికులు లగేజీ, పిల్లలతో బస్టాండ్ చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.
బీబీనగర్ : సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో బీబీనగర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వెళ్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ గంటన్నరపాటు నిలిచిపోయాయి. దీంతో పలువురు ప్రయాణికులు రోడ్డు మార్గం గుండా ప్రయాణించేందుకు ట్రైన్ దిగి వెళ్లిపోయారు.
యాదగిరిగుట్ట రూరల్ : సికింద్రాబాద్ రైల్వే ఘటన నేపథ్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల వద్ద యాదాద్రి భువనగిరి జోనల్ డీసీపీ కె నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, ఆలేరు, వలిగొండ, వంగపల్లి రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులతో పాటు ఏఆర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ను ఆరగంట, భువనగిరి రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు రెండు గంటల పాటు, బీబీనగర్‌లో శాతవాహన, శబరి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. వీటితో పాటు అక్కడక్కడా గూడ్స్ రైళ్లు సైతం నిలిపివేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశామని యాదాద్రి భువనగిరి జోనల్ డీసీపీ కె నారాయణరెడ్డి తెలిపారు. సివిల్, ఏఆర్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశాం. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో పలుచోట్ల అగ్నిపథ్ పథకాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూర్యాపేటలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. చిట్యాలలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. రామన్నపేటలో ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. బొమ్మలరామారంలో సీఐ టీయూ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.
రామగిరి: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సైనిక రిక్రూట్మెంట్లో కాంట్రాక్టు పద్ధతిని ఖండిస్తున్నట్లు తెలిపారు.