కేతేపల్లి, జూన్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశంమీద సోయి లేదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండలంలోని గుడివాడ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మన ఊరు-మనబడిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో రూ.31 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ దిమ్మెను ప్రారంభించి జెండాను ఎగురవేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష కాంగ్రెస్, రాష్ట్ర బీజేపీ పార్టీలకు మతి పోతుందన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెడితే పీఎం మోదీకి వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశ ప్రజలందరికీ అందేలా చేయడమే సీఎం కేసీఆర్ తదుపరి లక్ష్యమన్నారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, తాసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, సర్పంచులు కట్ట శ్రవణ్, బచ్చు జానకీరాములు, కేతేపల్లి ఎంపీటీసీ ఎ.వెంకన్నయాదవ్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, గుడివాడ ఉపసర్పంచ్ ఆర్.సైదులుగౌడ్, నాయకులు చల్లా కృష్ణారెడ్డి, బంటు మహేందర్, కె.సైదులుగౌడ్, జి.వేణుమాధవరెడ్డి, కె.యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.