యాదాద్రి, జూన్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలు గురువారం కోలాహలంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు.
రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖాజానకు రూ.18,23,356 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రి దేవస్థానంపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ సిబ్బంది ఈఓ గీతకు వినతి పత్రం అందజేశారు. కొండపైన దేవస్థానానికి అతిముఖ్యమైన ఆర్థిక వనరులైనా అద్దె గదులను తొలగించడం, లీజు, లైసెన్స్ రద్దు చేయడంతో ఉచితంగా ఏర్పాటు చేసిన అద్దె బస్సులకు నెలకు రూ.2.20 కోట్ల చెల్లింపుతో ఆలయానికి ఆర్థికభారం పడుతుందని వారు పేర్కొన్నారు.
ఆలయ పునర్నిర్మాణం అనంతరం కొండకింద, కొండపైన గార్డెనింగ్, పారిశుధ్యం, విద్యుత్ నిర్వహణతో పాటు అవుట్ సోర్సింగ్, భద్రత, పెన్షనర్లు, సిబ్బందికి జీతభత్యాలకు కలిపి నెలకు సుమారు రూ.2.50 కోట్లు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యం విషయంతో పాటు ఆలయంపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో దేవస్థాన అధికారులు గజవెల్లి రమేశ్‌బాబు, రఘు, రాంమోహన్, నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి వారికి హైదరాబాద్‌లోని పాత సఫీల్‌గూడకు చెందిన భక్తులు తీగల నర్సింహగౌడ్ దంపతులు బంగారు పూతతో తయారు చేసిన చెడీలు బహూకరించారు. గురువారం యాదాద్రి చేరుకున్న భక్తులు రూ. 2 లక్షల విలువగల చెడీలను స్వామివారి ప్రధానాలయంలో ఆలయ ఈఓ ఎన్. గీతకు అందజేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,81,800
వీఐపీ దర్శనం 60,000
వేద ఆశీర్వచనం 4,200
సుప్రభాతం 1,500
క్యారీబ్యాగుల విక్రయం 19,000
వ్రత పూజలు 1,14,400
కల్యాణకట్ట టిక్కెట్లు 28,000
ప్రసాద విక్రయం 9,02,650
వాహన పూజలు 6,200
అన్నదాన విరాళం 30,966
శాశ్వత పూజలు 55,000
సువర్ణ పుష్పార్చన 1,05,600
యాదరుషి నిలయం 76,340
పాతగుట్ట నుంచి 20,900
కొండపైకి వాహనాల ప్రవేశం 2,00,000
లక్ష్మీపుష్కరిణి 800
ఇతర విభాగాలు 16,000