యాదాద్రి, జూన్16 : రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో అవాంతరాలు సృష్టించింది. రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పింది. కానీ సీఎం కేసీఆర్ ధాన్యాన్ని తామే కొంటామని రైతులకు భరోసా కల్పించి మద్దతు ధర చెల్లించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తికాగా దశల వారీగా నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది.
జిల్లాలో ఏటా యాసంగిలో 2.40 లక్షలపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ప్రభుత్వం ఇతర పంటల సాగు చేయాలని సూచించడంతో ఈ సారి 1.65 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 289 కొనుగోలు కేంద్రాలు రెండు నెలలపాటు నిరంతరాయంగా నడువగా ఈ నెల 16న ముగిశాయి. మొదట 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా 1,95,307.200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటివరకు 30,124 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. రూ. 382.78 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 265.51 కోట్లు రైతుల ఖాతాలకు చేరింది. కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుని నగదు జమ చేయిస్తున్నారు. రైతులు ఈ సారి సన్న రకం ఎక్కువగా పండించారు.
నైరుతి రుతుపవనాలు రావడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతులు వానకాలం పంట సాగుకు సిద్ధమవుతున్నారు. వరితోపాటు పత్తి, కంది, పెసర, మినుము వేసేందుకు దుక్కులు దున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్న సమయంలో యాసంగి ధాన్యం డబ్బులు చేతికొస్తున్నాయి. దాంతో రైతులు సంతోషంగా సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తీసుకున్న స్థానిక అధికారులు రైతుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేసి జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులకు పంపించారు. అక్కడికి పూర్తి వివరాలు వెళ్లిన తర్వాత రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. గతంలో దళారులు, వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తే కనీసం నెల నుంచి రెండు నెలల తర్వాత డబ్బులు వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక తూకాలు, ధరల విషయంలో మోసాలకు చెక్ పడింది. సర్కారే గ్రామగ్రామాన కొనుగోళ్లు ఏర్పాటు చేయడంతో దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది.
యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 1,95,307.200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. గురువారంతో వరి ధాన్యం సేకరణ విజయవంతంగా ముగిసింది. జిల్లాలో 30,124 మంది(69.3 శాతం) రైతుల ఖాతాల్లో రూ. 265.51 కోట్ల నగదు జమ చేశాం. మిగతా రూ.120.27 కోట్ల నగదును వారం రోజుల్లో జమ చేస్తాం.
-గోపీకృష్ణ, సివిల్ సప్లయ్ మేనేజర్, యాదాద్రి భువనగిరి జిల్లా