ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పల్లెలు నేడు వికసిస్తున్నాయి. సమస్యలు, పారిశుధ్య లోపంతో కొట్టుమిట్టాడిన గ్రామాలు సుందరంగా మారుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో నెలనెలా లక్షలాది రూపాయలు ఇస్తూ అన్ని మౌలిక వసతులు కల్పిస్తుండడంతో గ్రామాలు, మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోతున్నాయి. నాలుగు విడుతల పల్లె ప్రగతి, మూడు విడుతల పట్టణ ప్రగతి కార్యక్రమాలు పూర్తి కాగా.. తాజాగా ఈ నెల 3న ఐదో విడుత పల్లె ప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కాగా.. పది రోజులుగా పనులు కొనసాగుతున్నాయి.
ఐదో విడుత పల్లె ప్రగతిలో చేయాల్సిన పనులను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పల్లెల్లో పర్యటించి గుర్తించారు. పంచాయతీరాజ్ శాఖ గుర్తించిన పనుల్లో ఇప్పటికే 60 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. ప్రధానంగా రహదారులు, మురుగు కాల్వల శుభ్రం, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పాత బావులు, బోర్లను పూడ్చడం, పడావుబడిన ఇండ్లను తొలగించడం వంటివి 80 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు 60 శాతం వరకు అయిపోయాయి. షెడ్యూల్ ప్రకారం పనులు కొనసాగుతున్నందున మరో ఏడు రోజుల్లో వంద శాతం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ పనులు షెడ్యూల్‌కు ఆలస్యంగా ప్రారంభమైనందున పల్లెప్రగతి కార్యక్రమం పూర్తయ్యేలోపు అన్నీ పరిష్కారమవుతాయన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతగా పాల్గొంటుండగా.. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములవుతూ ఎక్కడికక్కడ శ్రమదానాలు చేస్తున్నారు. కార్మికులతో కలిసి వీధులు ఊడ్చడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం, ఇండ్ల సమీపంలోని గుంతలు ఉంటే పూడ్చి వేస్తున్నారు. దీంతో పల్లెలు బాగుపడుతున్నాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్ల యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చి చాలా చోట్ల వాటిని తొలగింపజేస్తున్నారు. అలాగే పనులు పూర్తిచేసిన శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్నారు.

పల్లె ప్రగతిలో చేయాల్సిన పనులను సూర్యాపేట జిల్లాలో ముందే గుర్తించగా ఇప్పటికే 60 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొంటుండడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో వారం రోజుల కార్యక్రమంలో గుర్తించిన పనులన్నీ పూర్తవుతాయి.
– యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట
