హాలియా, జూన్ 12 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తుండడంతో వాటి రూపురేఖలు మారుతున్నాయి. 189 గ్రామ పంచాయతీల్లో పనులు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 189 గ్రామ పంచాయతీలు ఉండగా అనుముల మండలంలో 21, నిడమనూరులో 29, త్రిపురారంలో 32, తిరుమలగిరి (సాగర్)లో 34, పెద్దవూరలో 26, గుర్రంపోడులో 37, మాడ్గులపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున విడుదల చేసింది. ఆ నిధులతో ప్రస్తుతం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని సగానికి పైగా గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వలతో వీధులు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. సీసీ రోడ్లతో వర్షాకాలంలో వీధులు బురద మయం కాకుండా ఉంటాయని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనుముల మండలంలో 21 గ్రామ పంచాయలు ఉండగా రెండు నెలల క్రితం రూ.4.20 లక్షలతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు. ప్రస్తుతం 15 గ్రామ పంచాయతీల్లో పనులు పూర్తయ్యాయి. హజారిగూడెం, నాయుడుపాలెం, చల్మారెడ్డిగూడెం, పేరూరు, వీర్లగడ్డతండా, కొత్తపల్లి, చింతగూడెం, రామడుగు, శ్రీనాథపురం, యాచారం, మారేపల్లి, పులిమామిడి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో సీసీ రోడ్లు వేయడం వల్ల వీధులకు కొత్త కళ వచ్చింది. గతంలో చినుకు పడితే చిత్తడిగా మారేది. కానీ ఇప్పుడు ఆ బాధ తీరింది. మురుగు కాల్వలు నిర్మించడంతో వీధుల్లో నీరు చేరే అవకాశం లేకుండా పోయింది. దాంతో వర్షాకాలంలో దోమల బెడద ఉండదు.
– రషీద్, పేరూరు, అనుముల