నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,123 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో వైపు మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో వసతులు, నాణ్యమైన విద్యపై ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 30 వరకు
కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో అడ్మిషన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
రామగిరి, జూన్ 12: కొత్త విద్యాసంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానున్నది. దాంతో పాఠశాలలు విద్యార్థులతో సందడిగా మారనున్నాయి. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారికి స్వాగతం పలికేందుకు సిద్ధం చేశారు. ఈ విద్యాసంవత్సరం మన ఊరు-మన బడిలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 3,123 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 4,34,502 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఈ విద్యాసంవత్సరం బడులకు రానుండగా వారికి కొత్త విద్యాసంవత్సరంలో స్వాగతం పలికేందుకు ముస్తాబు చేశారు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా మార్చేందుకు మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించింది.
సర్కారు స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్‌ను అందిస్తున్నది. వీటిని ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరిన పాఠ్యపుస్తకాలను మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు తరలించనున్నారు. యూడైస్‌లో ఎన్రోల్ అయిన ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందించనున్నారు. పండుగ వాతావరణంలో బడులను తెరిచి ఈ నెల 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలతో బడిబాట నిర్వహించి అడ్మిషన్లు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరం ఇంగ్లిష్‌మీడియం ప్రారంభిస్తున్నందున ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బడిబాటలో భాగంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాల పంపిణీ చేపడుతున్నారు. సర్కార్ బడిలో అందించే నాణ్యమైన విద్య, మౌలిక వసతులను వివరిస్తూ అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
2022-23 విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక ప్రణాళికతో పాఠశాలు పునః ప్రారంభమవుతున్నాయి. ఉపాధ్యాయులు సకాలంలో విధులకు వెళ్లి బడిబాటతో పాటు మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడిలో పాల్గొనాలి. పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి బడులు తేరువాలి. వందశాతం ఎన్రోల్మెంట్ లక్ష్యంగా బడిబాట కొనసాగించి నాణ్యమైన గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ