రామగిరి, జూన్ 12 : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే మాలధారులకు మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల వక్తలు, గురుస్వాములు కోరారు. నల్లగొండ చిన్నవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు, మాలధారులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌తో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర సదస్సును నిర్వహించారు. సదస్సుకు ఆ సమితి కేంద్ర అధ్యక్షుడు రాజ్దేశ్ పాండే, రాష్ర్ట అధ్యక్షుడు బేతవోలు వెంకటేశ్వర్రావు, రాష్ట్ర అన్నప్రసాద కమిటీ చైర్మన్ తాండ్ర రాంప్రసాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుత్తా చంద్రశేఖర్‌తో పాటు పలువురు హాజరై మాట్లాడి పలు తీర్మానాలు చేశారు.
శబరిమలలో భక్తులు ఇరుముడి విప్పే కార్యక్రమానికి ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేయాలని, నడకదారిలో వచ్చే భక్తులు ప్రత్యేక టోకెన్లు ఇవ్వాలి. అయ్యప్ప స్వామి దర్శనం ప్రశాంతంగా కల్పించాలని తీర్మానాలు చేసి శబరిమల దేవస్థానానికి పంపిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ ప్రచార కమిటీ నిర్వాహకులు హరినారాయణ గురుస్వామి, ఉమ్మడి రాష్ర్టానికి చెందిన 300మంది గురుస్వాములు పాల్గొన్నారు .