ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. ఉదయం జరిగిన పేపర్1 పరీక్షకు 37,394 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 పరీక్షకు 37,394 మంది హాజరయ్యారు. 6,648మంది గైర్హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి కనిపించింది. కొంత మంది మహిళలు చంటిపిల్లలతో రాగా వారి ఆలనతో కోలాహలంగా మారింది.
రామగిరి, జూన్ 12 : ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేపర్ -1కు 37,394 మంది హాజరు కాగా 6,648 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 పరీక్షకు 33,974 మంది హాజరు కాగా 5,451 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు, వారి సహాయకులు రావడంతో రహదారులు రద్దీగా కనిపించాయి. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతి లేకపోవడంతో అభ్యర్థులు ముందగానే కేంద్రాలకు చేరుకున్నారు. పటిష్టమైన వసతులతో జరిగిన పరీక్షలను ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈఓలు, డీఆర్వోలు తనిఖీ చేశారు.