ఉన్నత చదువు.. అంతకుమించి అత్యున్నత వ్యక్తిత్వం. విదేశాల్లో మంచి ఉద్యోగం. అభిప్రాయాలు
కలిశాయి. మనస్సులు తెలిశాయి. పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. కలిసి బతకాలన్న ఆకాంక్షను ఇరు కుటుంబాల ముందుంచారు. ఒప్పించారు. రెండు వారాల క్రితమే కెనడా నుంచి వచ్చి మే 29న ఏడడుగులతో ఒక్కటయ్యారు. కోటి ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ నెల 9.. గురువారం ఉదయం. సరిగ్గా రెండ్రోజుల్లో నవ దంపతులు తిరిగి కెనడా వెళ్లాల్సి ఉంది.
స్నేహితుడు తీసుకున్న బాకీ వసూలు చేసుకుని వస్తానని చెప్పి అతడు కారులో బయల్దేరాడు. కోదాడ నుంచి హాలియా వెళ్లాల్సి ఉండగా, నావిగేషన్ వయా తిప్పర్తి మీదుగా మళ్లించింది. అదే శాపమన్నట్టు, సింగిల్ రోడ్డులో మృత్యురూపంలో వచ్చిన బస్సు అతడిని ఢీకొట్టి ఆయువు తీసింది. ఆరని పారాణితో 16 రోజుల పండుగకు సిద్ధమవుతున్న ఆమె విషయం తెలుసుకుని కుప్పకూలింది. ఏడాది క్రితమే కొవిడ్ మహమ్మారి తల్లిదండ్రులను తీసుకెళ్లగా, కట్టుకున్నవాడే ఇక అన్నీ అనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమెను విధి ఒంటరిని చేసింది. అతడి పేరు పృథ్వీ. ఆమె పేరు భార్గవి. వారి ప్రేమకు నూరేండ్లు!
కోదాడ రూరల్, జూన్ 10 : ఉన్నతమైన చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు. పెద్దల అంగీకారంతో ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం. ఇంకేం అంతా హాయేగా, సుఖమేగా అనుకునేంత లోపే ఆ జంట జీవితాల్లో తీవ్ర విషాదం. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గొరెంకలపల్లి వద్ద గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ పృథ్వీ మృతిచెందిన సంగతి తెలిసిందే. హృదయ విదారకమైన ఘటన వివరాలు.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన రాజేందర్, లెనిన్‌కుమారి దంపతుల కుమారుడు పృథ్వీ, కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నానికి చెందిన భార్గవి కెనడాలో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో మే 29న విజయవాడలో పెండ్లి చేసుకున్నారు. నూతన దంపతులు నేడు(శనివారం) కెనడా తిరిగి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆర్టీసీ బస్సు మృత్యువులా ప్రవేశించి వీరి కలలను కల్లలు చేసింది. గురువారం పృథ్వీ తన తండ్రి రాజేందర్‌తో కలిసి హాలియాలో ఉన్న స్నేహితుడికి ఇచ్చిన బాకీ వసూలు చేసేందుకు కారులో బయల్ధేరాడు. కోదాడ నుంచి నావిగేషన్ యాప్‌ను ఉపయోగిస్తూ ఎన్‌హెచ్ 65 పై ప్రయాణం కొనసాగించారు.
నకిరేకల్ నుంచి తిప్పర్తికి వస్తున్న క్రమంలో గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు వెళ్తూ కారును ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రాజేందర్‌కు గాయాలయ్యాయి. సాధారణంగా అయితే హాలియా చేరుకునేందుకు కోదాడ నుంచి హుజూర్నగర్, మిర్యాలగూడ మార్గం(83 కిలోమీటర్లు) గుండా ప్రయాణించాల్సి ఉండే. కాగా ఎన్‌హెచ్ 65 ద్వారా ప్రయాణంతో దూరం(130 కిలోమీటర్లు) పెరగడంతో పాటు మృత్యు ఒడికి చేరాడు.
కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నానికి చెందిన ముక్కపాటి రాజేశ్వర్‌రావు, ఉమ దంపతులకు కుమారుడు, కుమార్తె భార్గవి ఉన్నారు. కొడుకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండగా భార్గవి కెనడాలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఇష్టపడ్డ వ్యక్తిని పెండ్లి చేసుకుని సుఖసంతోషాలతో వైవాహిక జీవితం ప్రారంభం అవుతుందనుకుంటుండగా కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఇలా శోకసంద్రంలో మునగాల్సి వచ్చింది. ఇంకా విషాదం ఏంటంటే కరోనా మహమ్మారికి గతేడాది భార్గవి తల్లిదండ్రులను కోల్పోయింది. పృథ్వీ అంత్యక్రియలు కోదాడ మండలం అల్వాలపురంలో శనివారం జరుగనున్నాయి.