మిర్యాలగూడ, మే 24 : పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశీలకురాలు, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ అన్నారు. పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు.
సెట్ కాన్ఫరెన్సు ద్వారా పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు, తరగతి గదుల్లో వసతులు, పరీక్షల నిర్వహణ, సెల్ఫోన్ల నిషేధం, ప్రశ్నాపత్రాల సీలింగ్ తదతర అంశాలపై చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వాహణపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా ఉన్న శోభారాణిని విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆర్డీఓ రోహిత్‌సింగ్, తాసీల్దార్ గణేశ్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
రామగిరి : పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ద్వితీయభాష హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 175మంది గైర్హాజరయ్యారు. మొత్తం 19,900 మందికి గాను 19,725 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను ప్రత్యేక టీం సభ్యులు డిబార్ చేసినట్లు డీఈఓ భిక్షపతి వెల్లడించారు. కేంద్రాల్లో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
శాలిగౌరారం : మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల,గీతాంజలి ఇంగ్లిష్ మీడియం, మాదారం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను మంగళవారం డీఈఓ భిక్షపతి అకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా నకిరేకల్‌లోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట ఎంఈఓ నాగయ్య ఉన్నారు.