అడ్డగూడూరు, మే 24 : దేశంలోని అన్ని రాష్ర్టాలకు అన్నపూర్ణగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో రూ.11.25 కోట్లతో నిర్మిస్తున్న 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
ఆహార నిల్వల కోసం, దేశంలో కరువు, విపత్తులు, వరదలు వచ్చినప్పుడు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదాములను నిర్మిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల కాలంలో 28 గోదాములను నిర్మించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార నిల్వలకు ఉపయోగపడే గోదాములను కొత్తగా ఎక్కడా నిర్మించలేదని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాబోయే రోజుల్లో కోటి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మిస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న చిల్లర గాళ్లకు తమ పని తనం ద్వారా సమాధానం చెబుతామని మండిపడ్డారు. వచ్చే నెల చివరలో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి ఈగోదామును ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు జోసెఫ్, నాయకులు శ్రీరాముల అయోధ్య, పూలపల్లి జనార్దన్‌రెడ్డి, కమ్మంపాటి పరమేశ్, పోగుల నర్సిరెడ్డి, చిత్తలూరి నరేశ్, డీఈ రాజు పాల్గొన్నారు.