దామరచర్ల, మే 24 : దినదిన ప్రవర్థమానం చెందుతున్న దామరచర్ల మండలంలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నా స్థానికులు మాత్రం ప్రయాణానికి నోచడం లేదు. గతంలో దామరచర్ల, విష్ణుపురం, కొండ్రపోల్ గ్రామాల్లో స్టేషన్లు ఉండగా, దామరచర్ల స్టేషన్‌ను ఎత్తేసిన రైల్వే శాఖ ఇప్పుడు మిగిలిన రెండు స్టేషన్లనూ నిర్వీర్యం చేస్తున్నది. మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణుపురం స్టేషన్లో కొవిడ్ పరిస్థితుల ముందు వరకూ డెమో, పల్నాడు, నాగర్సోల్(షిర్డీ) చెన్నై, నారాయణాద్రి, నర్సాపుర్ రైళ్లు ఆగేవి. లాక్డౌన్లో రైళ్ల రాకపోకలను నిలిపేయగా, ఆంక్షలను ఎత్తివేసి రెండేండ్లయినా విష్ణుపురం స్టేషన్లో కేవలం డెమో, పల్నాడు రైళ్లను మాత్రమే నిలుపుతున్నారు. మిగతా రైళ్లు ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దామరచర్ల మండలంలో యాదాద్రి పవర్‌ప్లాంటు ఏర్పాటుతోపాటుగా పాలిష్, ముగ్గుమిల్లులు, సిమెంటు పరిశ్రములు ఉన్నాయి. ఇతర రాష్ర్టాలు, జిల్లాల వారు అనుకూలంగా ఉన్న రైలు ప్రయాణాన్ని ఉపయోగించుకొనేవారు. ప్రస్తుతం రైళ్లు ఆగక పోవడంతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు సామాన్యులకు అనువుగా ఉన్న డెమో(పుష్పుల్)ను ఎక్స్‌ప్రెస్‌గా మార్చి విష్ణుపురం నుంచి హైదరాబాద్‌కు 45 రూపాయలు ఉన్న టికెట్ ధరను 80 రూపాయలకు పెంచడంతో మండిపడుతున్నారు.
అన్ని గ్రామాలకు అనుకూలంగా ఉండే దామరచర్లలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని పరిసర మండలాలు, పట్టణాల ప్రజలు కోరుతున్నారు. నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధానరహదారికి పక్కనే ఉన్న దామరచర్ల రైల్వే స్టేషన్ అందరికి ఉపయోగకరంగా ఉండేది. గతంలో రైలు దిగిన వెంటనే ప్రయాణికులు ఆటోలు, బస్సుల సదుపాయం లభించి తమ తమ గ్రామాలకు చేరుకొనేవారు. తిరుపతికి వెళ్లాలంటే నారాయణాద్రి ట్రైన్ అందరికీ అందుబాటులో ఉండేది. అందరికీ అనుకూలంగా ఉండే దామరచర్లలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మండలంలో అధికంగా పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారు. వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే తక్కువ చార్జి ఉన్న రైలులో ప్రయాణం చేసేవారు. నేడు రైళ్లు నిలుపక పోవడం వల్ల బస్సుల్లో అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. దీనితో పాటుగా దామరచర్ల మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు, చదువు కోసం అనేక మంది నిత్యం దామరచర్ల నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ర్టాలకు ప్రయాణం చేస్తున్నారు. కానీ స్టేషన్ సరిగ్గా లేకపోవడంతో రైలు ప్రయాణానికి నోచుకోలేక పోతున్నారు.
-రూపావత్దత్తూనాయక్, వీర్లపాలెం