జూట్ బ్యాగులు తయారు చేస్తూ ఆదాయ మార్గం ఏర్పర్చుకోవడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు దేవరకొండకు చెందిన పున్న ఉమామహేశ్వరి. వివిధ రకాల బ్యాగులు తయారు చేసి దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మంచి ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
– దేవరకొండ, మే 23
ఉమామహేశ్వరి దేవరకొండ పట్టణంలో గ్రీన్మార్వో జూట్ రా మెటీరియల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. సరికొత్త డిజైన్లతో జూట్ బ్యాగులు తయారు చేస్తూ గుర్తింపు పొందారు. కోల్‌కతా, హైదరాబాద్, ఏలూరు నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి కుట్టు మిషన్లపై బ్యాగులు తయారు చేయిస్తున్నారు. సుమారు 50 రకాల బ్యాగులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కో బ్యాగ్ రూ.85 నుంచి 4 వేల వరకు ఉన్నాయి. వీటిని ఆర్డర్లపై వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాలతోపాటు అమెరికా, అస్ట్రేలియా తదితర దేశాలకు పంపిస్తున్నారు. పలు ఎగ్జిబిషన్లలోనూ వీటిని విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వివిధ సచ్ఛంద సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, వ్యాపార సంస్థలు బ్యాగుల తయారీకి ఆర్డర్ ఇస్తుండడంతో వీరికి చేతినిండా పని ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ వీరి ఉత్పత్తులను చూసి కొనుగోళ్లకు ఆర్డర్లు ఇస్తున్నారు.
జూట్ బ్యాగుల తయారీలో 12 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరు 9 కుట్టు మిషన్లపై ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వివిధ రకాల బ్యాగులను తయారు చేస్తారు. ఒక్కొక్కరు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నారు. వీరితోపాటు పలువురు విద్యార్థినులు, యువతులు బ్యాగుల తయారీపై శిక్షణ పొందుతున్నారు.
మేము తయారు చేసే జూట్ బ్యాగులకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆర్డర్లు ఇచ్చి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నేను కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లి మా ఉత్పత్తులను చూపించి పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకొస్తున్నాను. నెలకు అన్ని ఖర్చులు పోను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. మా దగ్గర ఉపాధి పొందే వారితోపాటు ప్రస్తుతం సుమారు 100 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు జూట్ బ్యాగుల తయారీ విధానంపై శిక్షణ ఇస్తున్నాం.
– పున్న ఉమామహేశ్వరి, గ్రీన్మార్వో జూట్ రా మెటీరియల్ బ్యాంక్ నిర్వాహకురాలు