కారేపల్లి, సెప్టెంబర్ 03 : కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన, ర్యాలీల నిర్వహణలో భాగంగా శుక్రవారం సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో వంటా వార్పును నిర్వహించనున్న్లు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి ఉన్నం వీరేందర్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. కారేపల్లి క్రాస్ రోడ్ లో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా శుక్రవారం ఇల్లెందు-ఖమ్మం ప్రధాన రహదారి కారేపల్లి క్రాస్ రోడ్డులో వంటా వార్పుతో నిరసన ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా యువజన సంఘం నాయకుడు ముత్యాల వెంకట అప్పారావు, నాయకులు తాత వెంకటేశ్వర్లు, సిద్ధంశెట్టి నాగయ్య, శివరాత్రి అచ్చయ్య, బానోతు రాందాస్, వెగ్గలం రాజు పాల్గొన్నారు.