రామగిరి (నల్లగొండ) మార్చి 10 : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో నల్లగొండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కీలక నిందితుడికి మరణశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదు, జరిమానాను విధిస్తూ నల్లగొండ రెండవ అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి, ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజారమణి సంచలన తీర్పు వెల్లడించారు. సీసీ ఫుటేజీలు, నిందితుల ఫోన్ల విశ్లేషణలు, 78 మంది సాక్షుల విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
కోర్టు సోమవారం తీర్పు వెలువరిస్తూ ఈ దారుణ హత్యలో సుభాష్ కుమార్ శర్మ (ఎ2, బీహార్) కు మరణశిక్ష విధించింది. మిగిలిన ఆరుగురు నిందితులు – మహమ్మద్ అజ్గర్ అలీ (ఎ3, నల్లగొండ), మహమ్మద్ అబ్దుల్ బారి (ఎ4, హైదరాబాద్), మహమ్మద్ అబ్దుల్ కరీం (ఎ5, మిర్యాలగూడ), తిరునగరు శ్రవణ్ కుమార్ (A6, మారుతి రావు సోదరుడు), సముద్రాల శివ (A7, మారుతి రావు కారు డ్రైవర్), ఎం ఏ నజీమ్ (A8, ఆటో డ్రైవర్, నల్లగొండ) కు జీవిత ఖైదు విధించింది. శర్మకు రూ.15,000, మిగిలిన ఆరుగురు దోషులకు రూ.10,000 జరిమానా విధించింది. ప్రధాన నిందితుడు, ప్రణయ్ భార్య అమృత తండ్రి టి. మారుతీరావు (A1) కేసు దర్యాప్తులో ఉండగా 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
2018 సెప్టెంబర్ 14న జరిగిన ఈ హత్య, తన కుమార్తె అమృత దళిత వ్యక్తి అయిన ప్రణయ్‌తో కులాంతర వివాహం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంపన్న వ్యాపారవేత్త మారుతీరావు చేసిన కాంట్రాక్ట్ హత్య. వారి కలయికను అంగీకరించలేక అజ్గర్ అలీ నేతృత్వంలోని కాంట్రాక్ట్ కిల్లింగ్ ముఠాను నియమించుకుని ప్రణయ్‌ను హత్య చేయడానికి రూ. 1 కోటి సుపారి చెల్లించాడు. అమృతకు సాధారణ గర్భధారణ తనిఖీలు చేయించుకుని ఆసుపత్రి వెలుపలకి వస్తుండగా ప్రణయ్‌ను కత్తితో దారుణంగా హత్య చేశారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సీసీ టీవీలో రికార్డైంది. ఇది దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ సంఘటన జరిగిన సమయంలో అమృత గర్భవతి. ప్రణయ్ హత్య తర్వాత ఆమె తన అత్తమామలతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. తర్వాత ఓ కొడుకుకు జన్మనిచ్చింది. ప్రణయ్ తల్లిదండ్రుల సాక్ష్యంతో పాటు ఆమె సాక్ష్యం కేసులో కీలక పాత్ర పోషించింది. విస్తృత విచారణల తర్వాత కోర్టు తీర్పును ప్రకటిస్తూ నిందితులకు కఠినమైన శిక్షలు విధించింది. ఈ తీర్పు ప్రణయ్ కు న్యాయం వైపు ఒక అడుగు. ఇటువంటి దారుణమైన నేరాలను సహించబోమని ఇది పునరుద్ఘాటిస్తుందని తీర్పు అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యుడు ఒకరు అన్నారు.
ప్రణయ్ హత్య కేసులో ప్రస్తుత మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తోపాటు ఇన్వెస్టిగేషన్ అధికారి, అప్పటి డీఎస్పీ పి.శ్రీనివాస్, స్పెషల్ పీపీ దర్శనం నరసింహులు కీలకంగా వ్యవహరించారు. హత్య జరిగిన సమయంలో అప్పటి జిల్లా ఎస్పీగా వ్యవహరించిన రంగనాథన్ సమర్పించిన సాక్షాలు ఎంతో ఉపయుక్తమైనట్లు తెలిపారు. ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఏఎస్ఐ మధుసూదన్, కోర్టు కానిస్టేబుళ్లు వీరస్వామి, నాగరాజు, సైదులు ను ఎస్పీ శరత్చంద్ర పవర్ అభినందించారు.
ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు వెల్లడి నేపథ్యంలో కోర్టు వద్ద అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. తుది తీర్పు వెల్లడి అనంతరం ప్రజా సంఘాలు, ప్రజలు, న్యాయవాదులు, స్పెషల్ పీపీ దర్శనం నరసింహ తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
శిక్ష ఖరారు తర్వాత కోర్టు ఆవరణలోకి తిరునగరి శ్రావణ్ కుమార్ కూతురు, భార్య ఇద్దరూ కారులో కోర్టుకు వచ్చారు. శ్రవణ్ కుమార్ కూతురు మాట్లాడుతూ తన తండ్రి నిర్దోషి అని, ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులే బలవంతంగా కేసులో ఇరికించారని బ్లాక్ పేపర్ పై సంతకం పెట్టుకుని తన తండ్రిని కేసులో చేర్చారని విలపించింది. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు నచ్చచెప్పి కారులో ఎక్కించి వారిని బయటకు పంపించారు.
ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు వెల్లడి నేపథ్యంలో సోమవారం నల్లగొండ కోర్టు వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి అనుమతించారు. తుది తీర్పు నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కోర్టుకు వస్తారని భావించినప్పటికీ వారు రాలేదు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు దోషులను జిల్లా వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు.