చండూరు, అక్టోబర్ 18 : రానున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. బుధవారం స్థానిక డాన్బోసో జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూములను నియోజకవర్గ ఎన్నికల అధికారి దామోదర్‌రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్డీఓ కార్యాలయంలో సర్వే లైన్స్ సీసీ కెమెరాల నిఘా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులకు ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట తాసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎలక్షన్ డీటీ దీపక్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ సైదులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
మునుగోడు, అక్టోబర్ 18 : సీ విజిల్ యాప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. బుధవారం మునుగోడు తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ విజిల్ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, అందుకు సంబంధించిన ఫ్లెక్సీని కార్యాలయం ముందు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫొటోలు, వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గ ఎన్నికల అధికారి దామోదర్‌రావు, తాసీల్దార్ నరేందర్ ఉన్నారు.