రామగిరి, జూలై 31: కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితం దక్కుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ్ధ(ఐటీఐ) ప్రాంగణంలో నిర్మిస్తున్న నైపుణ్యాల అభివృద్ధి సంస్థ్ధ, అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం(ఏటీసీ) పనులను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వ బాలుర, బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థ్ధలను సందర్శించి ఆ కళాశాలల్లోని తరగతి గదుల్లోకి వెళ్లి వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థ్ధి దశలోనే నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఐటీఐల స్థాయి పెంచడంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో బాలుర, బాలికలు, అనుముల, డిండిలలో నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. ఒక్కోక్క సెంటర్‌కు రూ. 6.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో శిక్షణలో జిల్లా విద్యార్థులకు ఎంతో లాభం జరుగుతుందన్నారు.