
నిడమనూరు, జూన్8 : మండలంలోని వెంగన్నగూడెం గ్రామంలోని నల్లచౌట చెరువు గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి గండి పడిన ప్రాంతాన్ని సందర్శించారు. గతేడాది అక్టోబర్‌లో తుపాన్ తాకిడికి చెరువుకు గండి పడిందని, దీంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించారు. దాంతో ఎమ్మెల్యే భగత్ చిన్న నీటి పారుదల శాఖ ఎస్ఈ ధర్మానాయక్‌ను ఫోన్లో మాట్లాడారు. గండి మరమ్మతు పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. గండి కారణంగా సాగు, తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తక్షణమే పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు వరకు డొంక రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం వేంపాడు స్టేజీ వద్ద కేటీఆర్ సామాజిక వనంలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నాటిన మొక్కను సందర్శించి తండ్రిని స్మరించుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు చేకూరి హనుమంతరావు, ముప్పారం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మేరెడ్డి వెంకటరమణ, ఉప సర్పంచ్ సలాది నాగరాజు, అయోధ్య, ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, బొమ్ము శివ, కొండారి రామయ్య, ఆవుల మట్టయ్య, కటారి మట్టయ్య, చిరంజీవి, రైతులు పాల్గొన్నారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తా : ఎమ్మెల్యే
తిరుమలగిరి (సాగర్): ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. నాగార్జునపేట సర్పంచ్ రమావత్ కనికిబాయితో మాట్లాడి గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, నాయకులు పురుషోత్తం, బిచ్చు, సతీశ్, రవి ఉన్నారు.