కట్టంగూర్, నవంబర్ 17: నకిరేకల్ ఎక్సైజ్ ఎస్సై కారు టైరు పేలి బోల్తాపడటంతో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణానగర్ హైవేపై చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న ఎక్సైజ్ ఎస్సై కారు శ్రీకృష్ణానగర్ సమీపంలోకి రాగానే టైరు పేలింది. దీంతో కారు అదుపు తప్పి ముందున్న బైక్ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలో పడింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న నకిరేకల్ ఎక్సైజ్ ఎస్సై భానుప్రకాశ్ ఆయన భార్య ప్రియాంకతో పాటు బైక్పై వెళ్తున్న నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలడుగు అంజయ్య, రేణుకలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఇతర వాహనదారులు గాయపడిన వారిని 108లో నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ ఎస్సై కుమార్తెకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.