నందికొండ, జూలై 28 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీ శైలం నుంచి వరద ఉధృతి పెరగడం, రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువ లో ఉండటంతో మంగళవా రం నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుద ల చేసేందుకు ఎన్ఎస్పీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు విడుదల చేయనున్నారు. మంగళవారం ఉదయంలోగా రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరనున్న నేపథ్యంలో నీటిని విడుదల చేయనున్నారు. నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు.
మంత్రుల రాకకు ఏర్పాట్లు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు మంగళవారం నాగార్జునసాగర్‌కు రానున్నారు. క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అనంతరం మంత్రులు జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.