నందికొండ, ఆగస్టు 1 : అల్మటీ, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లకు వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 2,57,383 క్యూసక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,09,966 క్యూసెక్కుల నీటిని స్పీల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు 585.20 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తూ శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను అదేస్థాయిలో సాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గత నెల 29న డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించి రోజుకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని స్పీల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా ఇప్పటి వరకు 54 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,57,383 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా అదేస్థాయిలో క్రస్ట్ గేట్లు, కాల్వలు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా అవుట్ ఫ్లో కొనసాగుతోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 312.50 టీఎంసీలకు గానూ 298.0120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. క్రస్ట్ గేట్ల ద్వారా 2,09,966 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 7,684 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 8,604 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,029 క్యూసెక్కులు, వరద ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ, ఎడమ, కుడి, ఎస్ఎల్బీసీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.50 అడుగులు( 202.0439 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 21,51,424 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం 8 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,15,424 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.