నందికొండ, అక్టోబర్ 16 : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా తొణికసలాడుతుండడతో బుధవారం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. సాగర్‌కు వరద పోటెత్తడంతో ఈ సీజన్లో మొదటిసారిగా ఆగస్టు 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించి సెప్టెంబర్ 19 వరకు విడుదల చేశారు. రెండు విడుతల్లో 435 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ ప్రస్తుతం 590 (312.0450 టీఎంసీలు) అడుగుల మేర నీటి నిల్వ ఉండడంతో బుధవారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా ఎన్నెస్పీ అధికారుల నీటి విడుదలను ప్రారంభించారు. 16,200తో ప్రారంభించి క్రమంగా 8 గేట్లను ఎత్తి 64,800 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌లోకి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను చేపడుతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఎడమ కాల్వ ద్వారా 6,022 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 6,253, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 28,907, వరద కాల్వ ద్వారా 400, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు, జల విద్యుత్ కేంద్రాలు, కాల్వల ద్వారా 1,08,782 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 93,707 క్యూసెక్కులు నమోదవుతున్నది.