Mutyalamma Jathara | దామరచర్ల : మండల కేంద్రం శివారులోని ఐదు గ్రామాల ఆరాధ్య దైవంగా వెలసిల్లుతున్న పొలిమేర ముత్యాలమ్మ జాతరను భక్తులు ఆదివారం నాడు ఘనంగా జరుపుకుంటున్నారు. మండలంలోని దామరచర్ల, వాడపల్లి, తాళ్ల వీరప్పగూడెం, నరసాపురం, ఇరికిగూడెం గ్రామాలకు చెందిన ప్రజలు పూర్వం అనేక రుగ్మతలు జబ్బులతో ఇబ్బంది పడడమే కాకుండా పంటలు సక్రమంగా పండకపోవడం వల్ల ఇబ్బందులకు గురవడంతో ఐదు గ్రామాల ప్రజలు కలసి పొలిమేరలో పూర్వం 100 సంవత్సరాల క్రితం ముత్యాలమ్మ దేవతను ప్రతిష్టించుకున్నారు.
నాటినుండి ప్రతి ఏడాది పాల్ఘుణ మాసంలో ఈ జాతరను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు అమ్మవారికి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అన్నప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా అర్పించారు. ఐదు గ్రామాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. శ్రీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. మండల ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. వాడపల్లి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.