మునుగోడు : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబం రోడ్డున పడుతున్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకంతో పాటు ఇతరులకు కూడా హెల్మెట్ వాడాలని సూచించారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని లేకపోతే వారికి జరిమానా తప్పదన్నారు. హెల్మెట్ వాడకపోవడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వీరాంజనేయులు నాగేశ్వరావు, రమణారెడ్డి, రాము, వెంకన్న, బాలాజీ, సతీష్, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.