నీలగిరి, జులై 11 : రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. నల్లగొండ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న తనను అకారణంగా తొలగించి, కుటుంబాన్ని ఏడాది కాలంగా ఇబ్బందులకు గురి చేస్తుండడంపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడు తెలిపాడు.
నల్లగొండ మున్సిపాలిటీ పరిధి గాంధీనగర్‌కు చెందిన ముకిరాల కరుణాకర్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు. ఏడాది క్రితం మంత్రి కోమటిరెడ్డి అనుచరుల ఒత్తిడి కారణంగా అధికారులు తనను విధుల నుండి తొలగించినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ విషయమై మంత్రికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదనను వెలిబుచ్చాడు. కుటుంబ పోషణ భారమై మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు పేర్కొన్నాడు. అక్కడే విధుల్లో ఉన్న టూ టౌన్ పోలీసులు గమనించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కరుణాకర్‌ను పోలీసులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.