నందికొండ, జనవరి 24 : నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎన్నెస్పీకి సంబంధించిన లక్షల విలువ చేసే ఐరన్ అపహరణకు గురైంది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం హిల్‌కాలనీలో నీటి సరఫరా చేసే ఫిల్టర్ హౌస్‌కు మోటర్ల కోసం దిగువన ఉన్న కృష్ణానదిలోకి ఐరన్‌తో ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. కృషానదిలో నీటి మట్టం పెరిగినప్పుడు ఐరన్ ట్రాక్ సహాయంతో మోటర్లను కిందికి పైకి జరిపే వారు. పైలాన్ కాలనీలో నూతనంగా ఫిల్టర్ హౌస్ నిర్మించినప్పటి నుంచి హిల్‌కాలనీలోని ఫిల్టర్ హౌస్ వాడకంలో లేదు.
ఇదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తులు కొంత కాలంగా గ్యాస్ సిలిండర్ల సహాయంతో కిలోమీటర్ల దూరం వరకు ఏర్పాటు చేసిన లక్షల విలువైన ఐరన్ ట్రాక్‌ను కట్ చేసి వాహనాల్లో తరలిస్తూ విక్రయిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు ఎన్నెస్పీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిల్‌కాలనీలో ఫిల్టర్ హౌస్ వాడకంలో లేకున్నా ఇక్కడ ఎన్నెస్పీకి సంబంధించిన సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు.
కిలోమీటర్ల దూరం వరకు ఏర్పాటు చేసిన ఐరన్ ట్రాక్ వెంబడి మనుషులు కూడా నడువడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ప్రాంతానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నెస్పీ సిబ్బంది సహాయం లేకుండా గ్యాస్ లిండర్లతో వెళ్లడం కష్ట తరమని, ట్రాక్ అపరహణలో ఎన్నెస్పీ సిబ్బంది ప్రమేయం కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నెస్పీకి సంబంధించిన విలువైన ఆస్తులు, భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.