యాదాద్రి, జనవరి 3 : నూతనంగా ఏర్పాటైన మోటకొండూర్ మండలంలో మరో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కానున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంతంలోని మోటకొండూర్, వర్టూర్, దిలావర్పూర్, ఇక్కుర్తి, మాటూరు, దర్శిగానిపల్లి, తేర్యాల, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలోని కాటేపల్లి, చాడ, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, నాంచారిపేట, చందాపల్లి, తిమ్మాపురం, చామాపూర్ గ్రామాలను కలుపుతూ మోటకొండూర్ నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కావాల్సిన ప్రతిపాదనలు అందజేశారు.
ఈ సందర్భంగా మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలు కలుపుతూ 1985లో ఆలేరు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేశారని, ఇందులో 1997లో మోటకొండూర్ సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగిందని మంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2016లో మండల విభజనలో భాగంగా మోటకొండూర్ నూతన మండలంగా ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం మండలంలో 18 గ్రామాలు ఉండగా, ఇందులో 8 గ్రామాలు ఆలేరు మార్కెట్ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. మోటకొండూర్ సబ్ మార్కెట్ యార్డు పరిధిలో 2015-16 వార్షిక సంవత్సరంలో 20,526 క్వింటాళ్ల వరి ధాన్యం ఉత్పత్తి కాగా రూ. 3,77,565 ఆదాయం, 2016-17లో రూ. 5,77,340 విలువైన 28,670 క్వింటాళ్ల వరి ధాన్యం, 2017-18లో రూ. 4,71,670 విలువైన 25,036 క్వింటాళ్లు, 2018-19లో రూ. 93,070 విలువైన 14,800 క్వింటాళ్ల వరి ధాన్యం సమకూరిందన్నారు. దీంతోపాటు మోటకొండూర్‌కు, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కు 10 కిలోమీటర్ల దూరం ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.
మోటకొండూర్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 950లో 5 ఎకరాల్లో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డును నిర్మించామన్నారు. మార్కెట్ యార్డుకు స్వాగత తోరణం, ప్రహరీ, నాబార్డు పథకం కింద 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణంతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చుట్టూ 1,200 మొక్కలు నాటామన్నారు. వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కావాల్సిన అన్ని అర్హతలను గుర్తిస్తూ మంత్రికి వివరించిన్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు.
మోటకొండూర్ నూతన వ్యవసాయ మార్కెట్ యార్డుకు కావాల్సిన అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ మార్కెట్ సూపర్ వైజర్, జూనియర్ మార్కెట్ సూపర్ వైజర్, అటెండర్ పోస్టులను మంజూరు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నట్లు చెప్పారు. దాంతో మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మోటకొండూర్ నూతన వ్యవసాయ మార్కెట్ మంజూరు కానునట్లు స్పష్టం చేశారు.