మోత్కూరు,మార్చి 19 : మోత్కూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భోజనం అధ్వానంగా తయారైంది. నీళ్ల చారు, గడ్డలతో ముద్దలుగా ఉన్న ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం ఉగాది పండుగ పూట విద్యార్థులకు నాణ్యత లేని కూరగాయలు, నీళ్ల చారు, గడ్డలతో ఉడికీ ఉడకని భోజనం వడ్డించడంతో తినలేక విద్యార్థులు పస్తులున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి వడ్డించిన అన్నం, కూరగాయలను పరిశీలించి, వంట వారితో వాగ్వాదానికిక దిగారు. పాఠశాలలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులు వసతి కల్పించారు.
వీరిలో 8,9,10 తరగతి విద్యార్థులు పట్టణంలోని పోతాయిగడ్డ పాఠశాల అద్దెభవనంలో ఉంటుండగా, 5,6,7 తరగతుల విద్యార్థులు బస్టాండ్ సమీపంలోని మరో అద్దె భవనంలో వసతి పొందుతున్నారు. వేర్వేరుగా తరగతులు, వసతులు పొందుతు న్నా.. పాఠశాల నిర్వాహణ మొత్తాన్ని ప్రిన్సిపాల్ ఒక్కరే చూస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. మార్కెట్లో తక్కువ ధరకు లభించే కుళ్లిన కూరగాయలు తెచ్చి వండుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.అద్దె భవనం కావడంతో వసతి సరిగా లేదని, పన్నెండేళ్ల నుంచి పాఠశాలకు కనీసం సున్నం కూడా వేయక పోవడంతో పాఠశాల ఆధ్వానంగా తయారైందన్నారు.
డైనింగ్ హాల్ కూడా కూడా సరిగా లేదని, పాఠశాల ఆవరణలో ఆరుబయటే విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని గతంలో కూడా ప్రిన్సిపాల్‌కు చెప్పినా మార్పు లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఈదుల రామచంద్రు, దాసరి జానమ్మ, సూరారం రాజు, సురేష్ ఆరోపించారు. ఉన్నతాధికారులు పరిశీలించి నాణ్యమైన భోజనం పెట్టాలని విజప్తి చేశారు. వంట ఏజెన్సీ వారితో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతున్న సందర్భంగా వివరణ అడిగేందుకు యత్నించగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ అందుబాటులో లేరు.