నల్లగొండ రూరల్, మే 3 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుక్రవారం రాత్రి నల్లగొండలో నిర్వహించిన రోడ్ షో విజయ వంతమైంది. రోడ్ షోకు నియోజకవర్గం నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో 30 వేలకు మందికి పైగా పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాల వద్దకు హరీశ్‌రావు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి గడియారం సెంటర్ వరకు డప్పు చప్పుళ్లు, కోలాట నృత్య ప్రదర్శనలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికిన వారిలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, తిప్పన విజయ సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, దేప వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
చండూరు : చండూరులో నిర్వహించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాంతో చండూరు పట్ట ణం గులాబీ జెండాలతో జనసంద్రమైంది.
హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సాయంత్రం 5 గంటలకు చండూరు చేరుకున్నారు. కోలాటాలు, గొల్లకురుమల డోలు వాయిద్యాలతో పట్టణమంతా మార్మోగింది. మాజీ మంత్రి హరీశ్‌రావు సాయం త్రం 7 గంటల ప్రాంతంలో స్థానిక డాన్‌బోస్కో కళాశాల ప్రాంతానికి చేరుకోగానే ప్రజల్లో కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అక్కడి నుంచి చౌరస్తా వరకు ర్యాలీతో వచ్చిన హరీశ్‌రావుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలు గులాబీ పూలు చల్లుతూ పటాకులు పేలుస్తూ సెంటర్‌కు తోడుకొని వచ్చారు.
అక్క డ కార్యకర్తలు, మహిళలు, రైతులను చూసి ఆయన ఉత్సాహభరితమైన ఉపన్యాసం ఇవ్వడం తో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్, కౌన్సిలర్ కోడి వెంకన్న, చిలుకూరి రాధికాశ్రీనివాస్, అన్నెపర్తి శేఖర్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, నాయకులు నకిరేకంటి రామలింగం, అన్నెపర్తి యాదగిరి, తేలుకుంట్ల జానయ్య, రావిరాల నగేశ్, గండూరి నగేశ్ పాల్గొన్నారు.