సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అదే పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఇసుక విషయంలో ఎమ్మెల్యే సామేల్‌ను కాంగ్రెస్ పార్టీ వారే దుయ్యబడుతున్నారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఒకడుగు ముందుకు వేసి తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తన కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ ఘటనలతో కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యమిస్తూ పాత వారిని పట్టించుకోవడం లేదని ఈ నెల 1న పీఏసీఎస్ బ్యాంకు వద్ద ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎమ్మెల్యే సామేల్‌కు సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ తగిలింది. అది జరిగి 15రోజులు కాకముందే మరో మారు పార్టీలో గొడవలు బట్టబయలు అయ్యాయి.
ఆదివారం ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి సామేల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు పెట్టించాడు. దీంతో ఆగ్రహించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించిపడేశారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్ పాత నాయకులమని చెప్పుకొనేవారే చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ‘ఫ్లెక్సీలు చింపిన లుచ్చా పని చేసిన వారికి, చేయించిన వారికి సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.. గుర్తుంచుకోండి.’ అంటూ సోషల్ మీడియాలో ఘాటైన పోస్టులు పెట్టగా.. మండలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వారి పెత్తనం ఏంటంటూ పాత నాయకులు చించివేసినట్లు తెలుస్తుంది.