చండూరు జనవరి 21 : చండూరు మున్సిపాలిటీలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ, మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) ఫోటో, ‘మంత్రి రాజన్న’ అని రాసి ఉన్న స్కార్పియో వాహనంలో మున్సిపాలిటీ విధుల్లో చక్కర్లు కొడుతూ రాష్ డ్రైవింగ్తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులమని చెప్పుకుంటూ.. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఆయన ఫొటో ఉన్న స్కార్పియో వాహనంలో వచ్చి విధ్వంసం సృష్టించారు.అతివేగంగా వాహనాన్ని నడుపుతూ స్థానిక యూనియన్ బ్యాంక్ వెనకాలే ఉన్న స్వర్ణ వైన్స్ గేటును గుద్దుకుంటూ లోపలికి వెళ్లారు. దాంతో.. అక్కడ మద్యం సేవిస్తున్నవారు, బ్యాంకుకు వచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు.
మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ‘ఇక్కడ మిమ్మల్ని ఎవరు వైన్ షాప్ పెట్టమన్నారు. మేము రాజన్న అనుచరులం. ఇక్కడ మీరు వైన్ షాప్ పెట్టినందుకు మాకు డబ్బులు ఇవ్వాలి’ అంటూ వైన్స్లో పనిచేసే కస్తాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించారు. అంతేకాదు ‘ఇది మా రాజన్న అడ్డ. మేము అడిగినప్పుడల్లా మాకు మద్యం ఇవ్వాలి’ అని మద్యం దుకాణాల్లో పనిచేసే వ్యక్తులపై దాడి చేస్తున్నట్లు సమాచారం. గత రెండు మూడు రోజుల నుంచి రాజన్న అనుచరుల పేరుతో వీరు దాడి చేస్తున్నట్లు స్థానికులు, మద్యం దుకాణం వారు తెలిపారు.
మద్యం దుకాణం వారు 100కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఎంతగా వారించినా వినకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఎదురు తిరిగారు. ఇలా’ మంత్రి రాజన్న’ అని వాహనం వెనకాల స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోటోతో మున్సిపల్ వీధులలో అలజడి సృష్టిస్తున్న వీళ్లకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే వీరిపై ఫిర్యాదు చేసేందుకు అందరూ భయపడుతున్నారు. ఇలా రోజురోజుకు చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు, దౌర్జన్యాలు, అరాచకాలు మితిమీరి పోతూ ఉండడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలుసుకొని.. అనుచరులను కట్టడి చేయాలని.. లేదంటే ప్రశాంతంగా ఉండే చండూరు మున్సిపాలిటీ మునుముందు గొడవలకు, కక్షలకు, నిలయంగా మారే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ యువకులే మున్సిపాలిటీలోని స్తంభాలకు మంత్రి రాజన్న అనే బ్యానర్లు కట్టి కలకలం రేపారు.