నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. నియోజకవర్గంలో కానిస్టేబుల్ ఇతరేతర పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారిని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు హెల్త్ ఫర్ ఫిట్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తెలిపారు. హాలియాలో నోముల ఎన్ ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ సహకారంతో హెల్త్ ఫర్ ఫిట్నెస్ పేరుతో 3కె రన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి యువతీ యువకులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, క్రీడాకారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గ విద్యార్థులు విద్యావంతులు కావాలని, ప్రజలు మంచి ఆరోగ్యం తో జీవించాలనే సంకల్పంతో గత నాలుగు సంవత్సరాల క్రితమే మా నాన్న దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే నియోజకవర్గాన్ని ప్రజారోగ్య పరిరక్షణ, విద్య, వైద్యంలో ముందజలో నిలుపడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.