పెద్దవూర, ఏప్రిల్ 5 : సీఎం కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరందించి రైతును రాజుగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కేవలం పెద్దవూర మండలంలోనే గడిచిన ఐదేండ్లలో రైతుబంధు పథకం కింద 214 కోట్లు, రైతుబీమా కింద 14 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 17 కోట్లు, ఆసరా పింఛన్ల కింద సంవత్సరానికి 13 కోట్లు, సీఎం సహాయ నిధి కింద 4.2 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
గడిచిన 30 ఏండ్లలో పెద్దవూర మండలం అభివృద్ధికి నోచలేదని, 2014లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 1994లో ప్రారంభించి వదిలేసిన వరద కాల్వను పునఃప్రారంభించి 80 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నీరందించిన ఘనత సీఎం కేసీఆర్ ఘనతే అని గుర్తుచేశారు. మండలంలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకుగాను నియోజకవర్గంలో నెల్లికల్లు లిఫ్ట్, మండలంలోని డిస్ట్రిబ్యూషన్ 8, 9 పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఇదే విధంగా దేశంలోని ప్రజలందరికీ పథకాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై కదిలారని, మనమంతా కలిసి ఆయన బాటలో నడిచి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయలన్నారు. ఎప్పుడు ఓట్లు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు.
సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, హాలియా, నిడమనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, నాయకులు సాదం సంపత్, గోనె విష్ణువర్ధన్‌రెడ్డి, గుంటక వెంకట్‌రెడ్డి, కర్ణ బ్రహ్మారెడ్డి, కర్నాటి వెంకట్‌రెడ్డి, మెండె సైదులు, కూరాకుల అంతయ్య, షేక్ బషీర్, షేక్ అబ్బాస్, రామలింగయ్య, దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, బోయ నరేందర్‌రెడ్డి, పొదిల శ్రీనివాస్, పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ : ట్రైకార్ చైర్మన్
గతంలో గిరిజనులు, ఆదివాసీలను పట్టించుకున్న నాయకుడు లేడని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజనుల ఆరాధ్యదైవంగా మారారని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆలిండియా బంజారా భవన్‌కు జూబ్లిహిల్స్‌లో స్థలం కేటాయించాలని ఎన్నిసార్లు ఎంతమంది ముఖ్యమంత్రులకు విన్నవించినా పట్టించకోలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎకరం స్థలంతోపాటు 50 లక్షల రూపాయలు కేటాయించి బంజారా భవన్ నిర్మించి గిరిజనులు, ఆదివాసీలకు అంకింతం చేసి వారి ఆత్మభిమానాన్ని కాపాడరన్నారు.
ఇలాంటి ప్రభుత్వాన్ని ఆశిర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమని భావించి 500 జనాభా ఉన్న తండాలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇటీవల గ్రామానికి 20 లక్షలు కేటాయిచడంతో తండాలు బాగా అభివృద్ధి చెందాయన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని తండాల అభివృద్ధికి త్వరలో 600 వందల కోట్లను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.