వేములపల్లి, అక్టోబర్ 16 : బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని ఆమనగల్లులో పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల క్రితం అభివృద్ధిని, ఇప్పటి అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకొని తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మోసపూరిత హామీలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. సకల జనుల సంక్షేమానికి పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. ఏదో ఒక పథకం ప్రతి గడపకూ అందినట్లు తెలిపారు.
దేశంలో తెలంగాణ అభివృద్ధిలో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుందని, అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. దివ్యాంగుల పింఛన్ రూ.4వేల నుంచి రూ.6 వేలకు, ఇతరుల పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో చెప్పడం అభినందనీయమన్నారు. గెలిచిన సంవత్సరం లోపే ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ గడ్డం స్పృధర్రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, పేరాల కృపాకర్‌రావు, సర్పంచ్‌లు చిర్ర మల్లయ్యయాదవ్, చెరుకుపల్లి కృష్ణవేణి, దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మేక లలిత, శ్రీరాంరెడ్డి, లక్ష్మీనారాయణ, రవి, ఇరుగు వెంకటయ్య, గురువారావు, దేవరాజు, వీరేందర్, ప్రసాద్, వెంకటేశ్ పాల్గొన్నారు.