ఆలేరు టౌన్ , ఫిబ్రవరి 8 : ముస్లిం మైనార్టీలకు ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అణగదొక్కుతున్నారని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎండీ బద్రుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలను ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ముస్లింలకు పెద్ద పీట వేశారని ఆయన స్పష్టం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న మైనార్టీ నేత వద్ద డబ్బుల్లేవని స్థానిక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడం పట్ల మైనార్టీ సోదరులు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హయాంలో ఆలేరులో మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. సునీతామహేందర్‌రెడ్డి హయాంలో ముస్లింల అభ్యున్నతి కోసం కోఆప్షన్ సభ్యునిగా నియమించడం, ఈద్గా , మసీదులను రూ. 30లక్షలతో అభివృద్ధి చేశారన్నారు. ముస్తాఫా , మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ రియాజ్, పట్టణ బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు ఎండీ షాబుద్దీన్, మండల మైనార్టీ మాజీ అధ్యక్షుడు ఎండీ గపూర్, సీనియర్ నాయకులు ఎండీ బాబు, ఎండీ ఫయాజ్, ఎండీ గోరేమియా,ఎండీ జమాల్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు గంపల విజయ్‌కుమార్ పాల్గొన్నారు.