మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) హెచ్చరించారు. చెరువులు నిండుగా ఉంటే జీవజాతులు సంతోషంగా ఉంటాయని, జీవజాతులన్నీ ఉన్నచోట జీవై వైవిధ్యం ఉట్టి పడుతుందన్నారు. సోమవారం ఉదయం మునుగోడు పట్టణాన్ని ఆనుకొని ఉన్న పెద్ద చెరువును మార్నింగ్ వాక్ చేస్తూ పరిశీలించారు. 395 ఎకరాలు ఉన్న మునుగోడు పెద్ద చెరువు మొత్తం కబ్జాకు గురైందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ పెద్ద చెరువును, చెరువుకట్టను, అలుగును పరిశీలించారు. తహసిల్దారు, సర్వేయర్, స్థానిక ఎంపీడీవోలతో కలిసి కట్ట మీదే రెవెన్యూ మ్యాప్‌ను పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు. మొత్తంగా ఎంగేజ్మెంట్ సర్వే నిర్వహించి చెరువు కబ్జాకు గురైతే ఆ కబ్జా చేసిన వారికి నోటీసులు పంపించి చెరువు హద్దులను నిర్ధారించాలన్నారు.
చెరువు కట్టను స్ట్రెంతెన్ చేసి వెడల్పు చేయాలన్నారు. చెరువు లోపలి భాగం వరకు లోతుగా మట్టిని తొలగించి చెరువు నిండుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే కాలంలో చెరువులను సుందరీకరణ చేస్తామని నల్లగొండ రోడ్డు నుంచి నార్కట్‌పల్లి రోడ్డు వరకు కట్టమీదగా రోడ్డు వెడల్పు పనులు కూడా చేపడుతామని అన్నారు. చెరువు భూమితో పాటు ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంది అనేది కూడా నివేదిక సమర్పించాలని తాసిల్దార్‌ను ఆదేశించారు. ఈ పరిశీలనలో స్థానిక నాయకులతో పాటు మునుగోడు ఇన్చార్జ్ తహసిల్దార్ నరేష్, మునుగోడు ఇన్చార్జి ఎంపీడీవో విజయభాస్కర్, నీటిపారుదల శాఖ డీఈ ప్రేమ్ కుమార్, సర్వేయర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.