సూర్యాపేట, మే 10 (నమస్తే తెలంగాణ) : ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ప్రజలకు అత్యవసర పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే ప్రజలు తమ పార్టీని గెలిపించుకోవడానికి కృతనిశ్చయానికి వచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అమోఘమైన స్పందన వచ్చింది’. అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం, ప్రజల స్పందన, బీఆర్ఎస్ గెలుపుపై అంచనాలు, తదితరాలపై మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన
కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇస్తే నాలుగు నెలల్లోనే స్వయం ప్రకటిత కరువును తేవడంతోపాటు కొత్తగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. గతంలో కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో ఉన్నదనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ నల్లగొండలో కేసీఆర్ గర్జిస్తే తోకముడిచి వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసింది.
పంటలు ఎండిపోతుంటే కరువు యాత్ర చేపట్టడంతో సమయం దాటిపోయినా హుటాహుటిన నీటిని విడుదల చేయడం, రైతుబంధు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన ప్రతి సారీ కేసీఆర్ నోరు తెరిస్తే తప్ప తమకు న్యాయం జరుగడం లేదని ప్రజలు గుర్తించారు. అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌కు మరింత బలాన్ని ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు రెండు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి కొనసాగించకపోవడంతో ఆ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే లోక్‌సభ ప్రచారాల్లో గులాబీ జెండా కనిపిస్తే ఎదురొచ్చి పలుకరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉత్సాహంతో ప్రచారాలు చేశారు. కేసీఆర్ పర్యటనలు కాకుండా తాము పట్టణాలు, పల్లెల్లో రోడ్ షోలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం వచ్చారు. దాంతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైనట్లు నిర్ధారణకు వచ్చాం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పుట్టిన బీఆర్ఎస్ విజయం సాధించి తొమ్మిదిన్నరేండ్ల పాటు దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్ది ప్రజలకు కావాల్సిన అన్నీ సమకూర్చింది. నాలుగు నెలల క్రితం మాయమాటలు, 420 మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త హామీలు అమలు చేయకపోగా కేసీఆర్ చేపట్టిన పాత వాటిని కూడా కొనసాగించడం లేదు. ఈ విషయాన్ని గ్రహించి తాము మోసపోయామని ప్రజలు మదనపడుతున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ను గెలిపించుకొని ఆ పార్టీ గొంతు ఎండకుండా ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు కచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. అందుకే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోవడం అత్యవసరం అని ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అడిగినా, అడగకున్నా.. ఎలాంటి ఉద్యమాలు, నిరసనలు చేపట్టకున్నా ప్రజలకు అవసరమున్న వాటిని గుర్తించి వారి అభ్యున్నతి కోసం పథకాలు చేపట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా విజయాలు సాధిస్తున్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంతకుముందు కేసీఆరే అప్పగించారని బుకాయించారు. దీంతో కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గర్జిస్తే తోక ముడిచి కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. కేసీఆర్ కరువు యాత్ర చేపట్టడంతో కాల్వల్లో కొంతమేర నీళ్లు పారినై. రైతుబంధు ఇచ్చిండ్రు. ఇలా ప్రతి సారీ కేసీఆర్ నోరు తెరిస్తే తప్ప తమకు న్యాయం జరుగడం లేదని ప్రజలు గుర్తించారు.
కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు బలం ఉండాలంటే పార్లమెంట్ సీట్లు ఇవ్వాలనే కృతనిశ్చయానికి ప్రజలు వచ్చారు. ఈ సారి కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమికి పూర్తి మెజారిటీ రాదు. అక్కడ ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర కాబోతుంది. అందుకని ఇక్కడ బీఆర్ఎస్కు పట్టం కడితే ప్రజల బతుకులు బాగుపడుతాయి. ప్రజల తరఫున కొట్లాడేందుకు అవకాశం ఉండాలంటే జిల్లాలోని నల్లగొండ, భువనగిరి స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. అని జగదీశ్‌రెడ్డి కోరారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఒక్క తడికి నీటిని ఇస్తే లక్షలాది ఎకరాల్లో పంట చేతికి అందేది. కానీ.. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా సాగర్ కట్ట ఎక్కే దమ్ము లేకపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు కరువు చాయలు అలుముకుంటే సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీలో ఉన్నా నాటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నీళ్లు వదిలి పంటలను కాపాడాం. నాటి కన్నా సాగర్‌లో ఎక్కువ జలాలు ఉన్నా నీటిని విడుదల చేయించలేని జిల్లా మంత్రులను రైతులు ఈసడించుకుంటున్నారు. వాస్తవానికి కృష్ణాకు సమస్య వస్తే గోదావరి నుంచి నీటిని తీసుకోవడానికి గతంలో కేసీఆర్ ప్రయత్నాలు చేసి సాగర్ ఎడమ కాల్వను బతికించుకునేందుకు కాళేశ్వరం మూడో టీఎంసీ ఆలోచన చేసి ప్రతిపాదనలు కూడా తయారు చేయించారు.
నదీ జలాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకే గొంతుక. గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో ఈ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయా రాష్ర్టాలకు జలాలను పంచేందుకు ఒక్క తాటిపైకి వచ్చాయి. కాబట్టి తెలంగాణ కోసం ఎవరూ కొట్లాడరు. తెలంగాణ ప్రజల గురించి ఆ రెండు పార్టీలు ఆలోచన చేయవు. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలను కృష్ణార్పణం చేయగా, గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ మాట్లాడుతున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణను ఎడారిని చేస్తాయి. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 60 శాతం భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది.