సూర్యాపేట టౌన్, మార్చి 25 : పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాసాలు ఫలించాలని, ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులచే ఉపవాస దీక్షను విరమింపజేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ ముందడుగు వేసి అన్ని పండుగలను గౌరవించాడన్నారు.
తెలంగాణలో గంగ జమున తహజీబ్ లా ఒకరి పండుగలను ఒకరు గౌరవించే విధానం రావాలని అది ప్రభుత్వంతోనే మొదలు కావాలని భావించారన్నారు. అందులో భాగంగానే దసరాకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కు తోఫాలు, ముస్లింలకు ఇఫ్తార్ విందులతో పాటు తోఫాలను అందజేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.