నకిరేకల్, మే 11 : కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే 2014కు ముందున్న కరువు కాటకాలు
పునరావృతమవుతాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 24 గంటల కరెంటు, మంచినీళ్లు ఇవ్వలేని చేతగాని దద్దమ్మలకు ఓటెందుకెయ్యాలని ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో శనివారం నకిరేకల్ పట్టణంలో కనకదుర్గ గుడి నుంచి మెయిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసోళ్లకు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇచ్చారా..? రైతు బంధు రూ.15వేలు వచ్చినయా? వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చారా? రూ.2 లక్షల రుణమాఫీ చేశారా? కల్యాణలక్ష్మి డబ్బుతోపాటు తులం బంగారం ఇచ్చారా? అని ప్రజలను అడిగారు. అడగకపోయినా అన్నం పెట్టిన పెద్ద కొడుకు లాంటి కేసీఆర్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని అన్నారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయక వ్యంగ్య మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లు అడిగేందుకు సిగ్గుండాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరి నీళ్లు తెలంగాణలో పారవని, రాష్ట్రం ఎడారిగా మారడం ఖాయమని పేర్కొన్నారు. తాగు, సాగునీరు లేక 2014కు ముందు దుస్థితిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో దుర్మార్గపు రాజ్యం పోవాలంటే బీఆర్ఎస్ను 16 స్థానాల్లో గెలిపించాలన్నారు. 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఢిల్లీలో ఆయన గళం విప్పుతారని చెప్పారు. కాంగ్రెస్ మోసాలను గుర్తించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ కేసీఆర్ ఏ రోజూ దేవుడిని రాజకీయంగా వాడుకోలేదన్నారు. దేవుడు వేరు, అభివృద్ధి వేరు అని ప్రజలు గమనించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా దేవుళ్లపై ఒట్టు వేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి సీఎం కేసీఆర్ రైతు బంధు కోసం రూ.7,500 కోట్లను ప్రభుత్వ ఖజానాలో వేశారని, కాంగ్రెస్ గెలిచాక వాటిని రైతులకు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించారని అన్నారు. తాను 35 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, తనపై ఆవగింజంత తప్పు కూడా లేదని పేర్కొన్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని హామీనిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ గతంలో భువనగిరి ఎంపీలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
క్యామ మల్లేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాం, బొప్పని స్వర్ణలత సురేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు ప్రగడపు నవీన్‌రావు, కేశవరాజు, యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.